సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని చైన్నె ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి ఇరాన్ సూచించిన ప్రకారం అక్వాన్ అని నామకరణం చేశారు. ఈశాన్య రుతు పవనాల ప్రవేశం తదుపరి బంగాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పాయి. వీటి ద్వారా తమిళనాడుకు ఒరిగింది అంతంత మాత్రమే. పూర్తి స్థాయిలో ఈశాన్య రుతు పవనాల ప్రభావం ఇంకా రాష్ట్రంలో కనిపించడం లేదు. చెదురు మదురుగానే వర్షాలు పడినా ఆశించిన మేరకు వర్షపాతం నమోదు కాలేదు. అదే సమయంలో రెండు రోజులుగా భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మధ్య అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల పరిసరాల్లో నెలకొన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ శనివారం నాటికి తీవ్ర అల్పపీడనంగా, 15వ తేదీన వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత మరింత ఉత్తర–వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
రాబోయే రోజుల్లో వర్ష సూచన
తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం పశ్చిమ కనుమల జిల్లాలు, ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయి. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుంది. 15, 16 తేదీల్లో పశ్చిమ కనుమల జిల్లాలు, దక్షిణ తమిళనాడులో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17, 18 తేదీల్లో తెన్‌కాశి, తూత్తుకుడి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు, ఇతర పశ్చిమ కనుమల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 19వ తేదీ కూడా దక్షిణ తమిళనాడు, పశ్చిమ కనుమల జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.
మత్స్యకారులకు కీలక హెచ్చరికలు
తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుండటంతో మత్స్యకారులకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు అండమాన్ సముద్రం, ఆగ్నేయ, నైరుతి, మధ్య బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 16వ తేదీన దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో గాలుల వేగం గంటకు 55–65 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 75 కిలోమీటర్ల వరకు ఉంటుందని, 17వ తేదీన నైరుతి, మధ్య బంగాళాఖాతంలో గంటకు 60–70 కిలోమీటర్ల వేగం, ఆంధ్రప్రదేశ్ తీరం, పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో గంటకు 45–65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లోతైన సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని, ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.


