జెమ్‌ వీరమణి కేసులో మలుపు | - | Sakshi
Sakshi News home page

జెమ్‌ వీరమణి కేసులో మలుపు

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

● మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ సహా ఏడుగురిపై కేసు

సాక్షి, చైన్నె: మైనర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, జెమ్‌ గ్రానైట్‌ చైర్మన్‌ వీరమణి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును నీరుగార్చేందుకు సహకరించారన్న ఆరోపణలపై చైన్నె మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ సహా ఏడుగురు పోలీసు అధికారులపై ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు నమోదు చేయడం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 10 మందికి పైగా మైనర్లను తన ఇంటికి పిలిపించి, డబ్బు ఆశచూపి లైంగికంగా వేధించాడన్న ఆరోపణలపై జెమ్‌ వీరమణితో పాటు ఆయనకు సహకరించిన సోదరుడు మహేంద్ర చిందన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. నాలుగు నెలలకు పైగా సిట్‌ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో కేసు నీరుగార్చే యత్నం

గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అరుణ్‌ చైన్నె మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో జెమ్‌ వీరమణిపై ఫిర్యాదు అందింది. అప్పట్లో సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ యాస్మిన్‌ నేతృత్వంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేసింది. వీరమణి మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం లేదని పేర్కొంటూ అప్పటి పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించి కేసును పక్కన పెట్టారు. దీని వెనుక భారీ మొత్తంలో డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు వచ్చాయి.

ఏడుగురు అధికారులపై కేసులు

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చైన్నె పోలీసులు ఈ కేసును తిరిగి తెరిచి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కొందరు బ్రోకర్లు, పోలీసు అధికారుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తును ఆలస్యం చేసి నిందితులను తప్పించేందుకు భారీగా డబ్బు చేతులు మారినట్లు బ్యాంకు బదిలీ ఆధారాల ద్వారా సిట్‌ నిర్ధారించింది. దీంతో తాజాగా చైన్నె మాజీ పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌, అదనపు కమిషనర్‌ రాధిక, అసిస్టెంట్‌ కమిషనర్‌ యాస్మిన్‌, ఒక డిప్యూటీ కమిషనర్‌, ఒక ఇన్‌స్పెక్టర్‌, మరో ఇద్దరు పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం చర్చకు దారితీసింది.

సస్పెన్షన్‌కు రంగం సిద్ధం

ఈ ఏడుగురు అధికారులు ఎవరి ఆదేశాల మేరకు దర్యాప్తును నిలిపివేశారనే కోణంలోనూ సిట్‌ విచారణ జరుపుతోంది. వీరికి సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తుల పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ఐపీఎస్‌ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే మాజీ కమిషనర్‌ అరుణ్‌ సహా నిందితులైన అధికారులందరినీ సస్పెండ్‌ చేసే అవకాశం ఉంది. ఈ పరిణామంతో జెమ్‌ వీరమణి కేసులో తదుపరి ఎవరి అరెస్టులు ఉంటాయోనని తమిళనాడు రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement