స్కాలర్‌షిప్‌ల వివాదం | - | Sakshi
Sakshi News home page

స్కాలర్‌షిప్‌ల వివాదం

Nov 14 2026 1:11 AM | Updated on Nov 14 2026 1:11 AM

● ప్రతి పక్షాల ఆగ్రహం ● జాప్యం లేదన్న ప్రభుత్వం

సాక్షి, చైన్నె: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు అంబేడ్కర్‌ విదేశీ ఉన్నత విద్యా స్కాలర్‌షిప్‌ పథకం కింద నిధుల విడుదలలో జాప్యం వివాదానికి దారి తీసింది. ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. దీన్ని ప్రభుత్వం ఖండించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 366 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు కాగా, విదేశాల్లో చదువుతున్న 84 మంది విద్యార్థులకు రూ.30.24 కోట్లు విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఈ పథకం కింద 366 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 165 మంది ఇప్పటికే విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరగా, మిగిలిన 201 మంది 2027 జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో చేరనున్నారు. విశ్వవిద్యాలయాల్లో చేరిన 165 మందిలో 140 మంది పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 84 మందికి ట్యూషన్‌ ఫీజులు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.30.24 కోట్లు మంజూరు చేశారు. మరో 56 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, వారి విశ్వవిద్యాలయ బ్యాంకు ఖాతా వివరాలను ప్రభుత్వం కోరింది. ఇంకా దరఖాస్తు చేసుకోని 25 మంది తక్షణమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. విద్యార్థులు విదేశాలకు వెళ్లే ముందు వీసా, విమాన ఛార్జీలు, ట్యూషన్‌ ఫీజు అడ్వాన్స్‌ వంటి ప్రాథమిక ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 116 మంది విద్యార్థులకు టాడ్కో ద్వారా రూ.9.50 కోట్ల ప్రత్యేక విద్యా రుణాలను అందించింది. స్కాలర్‌షిప్‌ మొత్తం విడుదలైన తర్వాత ఆ నిధుల నుంచే ఈ రుణాన్ని తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంది. ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా పారదర్శకంగా నిధుల పంపిణీ జరుగుతోందని, గరిష్ఠంగా రూ.36 లక్షల పరిమితికి లోబడి ట్యూషన్‌ ఫీజుతో పాటు వసతి, జీవన వ్యయాలను నేరుగా విశ్వవిద్యాలయ ఖాతాలకు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. ముందుగా ఈ జాప్యంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌, ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అర్హత పత్రాలు సమర్పించినప్పటికీ ట్యూషన్‌ ఫీజులు విడుదల చేయకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రభుత్వం వేధిస్తున్నట్టు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement