సాక్షి, చైన్నె: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ గవర్నర్ ఆర్.వి.అర్లేకర్ శుక్రవారం ఉదయం హస్తినకు పయనమయ్యారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికను అందజేసినట్టు సమాచారం. టీవీకే ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రధాన ప్రతిపక్షాలైన డీఎంకే, అన్నాడీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగిన పలు ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి. దీపావళి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సబ్–ఇన్‌స్పెక్టర్ సహా 14 మంది హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విల్లుపురం జిల్లా సెంజి ప్రాంతంలో బాలిక హేమలత అదృశ్యమై 33 రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కడలూరులో ఒకరి తర్వాత మరొకరు చొప్పున బాలికలు, యువతులు అదృశ్యం అవుతుండడం కలకలం రేగింది. కళ్లకురిచి మహిళా కలెక్టర్‌కు అధికార పార్టీ ఎమ్మెల్యే అసభ్యకర సందేశం పంపారన్న ఆరోపణలతో పాటు, సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వ్యక్తిపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎం.రవిశంకర్ దాడి చేశారన్న ఘటన రాజకీయంగా దుమారం రేపింది.
ముఖ్యమంత్రి సమీక్షలు.. గవర్నర్ నివేదిక
ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం విజయ్ గత మూడు రోజులుగా సచివాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్, ఇంటెలిజెన్స్ ఐజీ ఆస్రాగార్గ్‌తో నేరాల నియంత్రణపై చర్చించారు. మరోవైపు, తమిళనాడులోని శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక కోరుతూ కేంద్ర హోంశాఖ గవర్నర్‌ను ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అర్లేకర్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్ షాకు సవివరంగా నివేదించినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన అనంతరం గవర్నర్ అర్లేకర్ జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లనున్నారు. అక్కడ జరిగే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదివారం ఆయన తిరిగి చైన్నె చేరుకుంటారు. గవర్నర్, అమిత్ షా భేటీ ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గవర్నర్ తన నివేదికలో ఎలాంటి అంశాలు పేర్కొని ఉన్నారో అన్న చర్చ ఊపందుకుంది.


