అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త అరెస్టు

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

తిరువొత్తియూరు: సేలం జిల్లా ఎడప్పాడి మున్సిపాలిటీ పరిధిలోని దావాన్‌ వీధి కాట్టువలువు ప్రాంతానికి చెందిన మణికండన్‌ (33) ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో కలెక్షన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య నందిని (26). వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ గొడవలు జరుగుతుండేవి. భార్య నందిని తరచూ మొబైల్‌ ఫోన్‌లో ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడుతుండటంతో మణికండన్‌ ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. సోమ వారం రాత్రి కూడా ఇదే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో మణికండన్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం అర్ధరాత్రి సమయంలో భార్యాపిల్లలు అందరూ ఒకే గదిలో నిద్రిస్తున్న వేళ, నిద్ర లేచిన మణికండన్‌ తన చేతులతో భార్య నందిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. ఊపిరాడక నందిని అక్కడికక్కడే మృతి చెందింది. ఆ శబ్దానికి నిద్రలేచిన పిల్లలు, తల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి గట్టిగా రోదించారు. పక్క గదిలో పడుకున్న మణికండన్‌ తల్లి రాజాత్తి పిల్లల ఏడుపు విని వచ్చి చూడగా, నందిని మరణించి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురైంది. అక్కడే ఉన్న మణికండన్‌ను నిలదీయగా తనే గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, నందిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం ఎడప్పాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు మణికండన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఎల్పీజీ గ్యాస్‌ స్టేషన్‌లో

కృత్రిమ కొరత

తిరువళ్లూరు: గ్యాస్‌ పిల్లింగ్‌ కేంద్రాల్లో కృత్రిమ కొరతను సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆటో డ్రైవర్‌లు వాపోయారు. తిరువళ్లూరు పట్టణంలో వేలాది ఆటోలు నిత్యం ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చుతున్నాయి. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటోలలో ప్రయాణించే వారు విపరీతంగా తగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పట్టణంతో పాటు కడంబత్తూరు, పేరంబాక్కం, తిరుప్పాచ్చూర్‌, వేపంబట్టు, తిరువూరు, సెవ్వాపేటతో పాటు పలు ప్రాంతాలకు చెందిన ఆటోలు తిరువళ్లూరుకు వచ్చి గ్యాస్‌ పిల్లింగ్‌ చేసుకుని తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి అక్కడ రాకపోకలను సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి వారంలో రెండు రోజులు గ్యాస్‌కు కృత్రిమ కొరత ఏర్పడుతోంది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని గ్యాస్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలకు చెందిన యజమానులు తరచూ కృతిమ కొరతను సృష్టిస్తున్నారు. కొరత వున్నట్టు చూపించి పిల్లింగ్‌ కేంద్రాలను మూసివేసి, రెండు రోజుల తరువాత తెరిచి అధిక ధరలకు గ్యాస్‌ను విక్రయిస్తున్నారని ఆటో డ్రైవర్‌లు వాపోయారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం గ్యాస్‌ సమస్య ఏర్పడడంతో ఆటోల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్‌ పిల్లింగ్‌ కేంద్రాల వద్ద ఆటోలు బారులు తీరాయి. అధికారులు స్పందించి గ్యాస్‌లో కృత్రిమ కొరతను సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement