14న బంగాళాఖాతంలో అల్పపీడనం | - | Sakshi
Sakshi News home page

14న బంగాళాఖాతంలో అల్పపీడనం

Nov 11 2026 12:19 AM | Updated on Nov 11 2026 12:19 AM

● 4 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక ● రామేశ్వరంలో కుండపోత

సాక్షి, చైన్నె: బంగాళాఖాతంలో ఈనెల 14న అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో బుధవారం నుంచి తమిళనాడులోని 4 దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో 13న అల్పపీడనం ఏర్పడి, తదుపరి 24 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ప్రకటించారు. మన్నార్‌ గల్ఫ్‌ ప్రాంతంలో 1.5 కి.మీ ఎత్తులో, ఆగ్నేయ అరేబియా సముద్రం–లక్షద్వీప్‌ ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తులో వాతావరణ ప్రసరణలు స్థిరపడి ఉన్నాయని వివరించారు. బుధవారం శివగంగ, రామనాథపురం, తూత్తుకుడి, తిరునెల్వేలి (నైల్లె) జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు మరియు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తంజావూరు, తిరువారూర్‌, మైలదుత్తురై, నాగపట్నం, పుదుక్కోట్టై, దిండిగల్‌, మదురై, విరుదునగర్‌, తేని, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలులల్లో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. చైన్నె నగరంలో మేఘావతమై ఉండి కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈనెల 15 వరకు అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఆయా సముద్ర ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కుమారి సముద్రం , దాని పరిసర ప్రాంతాలలో సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన వాతావరణ సుడిగుండం (వలయం) ప్రభావంతో రామేశ్వరం తీర ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం అంతా విస్తారంగా వర్షం కురిశాయి. రామనాథపురం జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి తంగచిమడంలో 5 సె.మీ, రామేశ్వరంలో 4 సె.మీ , సాంబన్‌, మండపంలలో 3 సె.మీ వర్షం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement