సాక్షి, చైన్నె: ఆగ్నేయ అరేబియా సముద్రం, కేరళ తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం (అట్మాస్ఫియరిక్ సర్క్యులేషన్) ఏర్పడటంతో ఆదివారం తమిళనాడులోని డెల్టా ప్రాంతాలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం తెలిపింది. తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై, పుదుక్కోట్టై, రామనాథపురం, తూత్తుకుడి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. చైన్నె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, శివగంగ, ఈరోడ్, తిరుప్పూర్, దిండిగల్, మదురై, విరుదునగర్, తేని, తెన్కాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చైన్నె, శివారు ప్రాంతాలలో ఆకాశం మేఘావృ మై ఉండి, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన మోస్తరు వర్షం పడవచ్చు అని పేర్కొన్నారు. ఇక సోమవారం తంజావూరు, తిరువారూర్, మైలాడుతురై, నాగపట్నం, పుదుక్కోట్టై, శివగంగ, రామనాథపురం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, విరుదునగర్, దిండిగల్, మదురై, తేని, తూత్తుకుడి, తెన్కాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠంలో 9 సెం.మీ. ఊటీ – 8 సెం.మీ. కళ్లకురిచ్చి జిల్లా మడంబూండి, కుంతపాలెం ( 7 సెం.మీ. చొప్పున, తిరునెల్వేలి, కిన్నకోరై (నీలగిరి), ఆర్.ఎస్. మంగళంలో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
విమాన ఇంధనంపై పన్ను తగ్గింపు ప్రయోజనం ఎవరికి?
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వం విమాన ఇంధనంపై విలువ ఆధారిత పన్ను తగ్గించినప్పటికీ, విమానయాన సంస్థలు ఆ ప్రయోజనాన్ని ప్రయాణికులకు అందించకుండా ఛార్జీలు భారీగా పెంచడంపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం విమాన ఇంధనం పై చైన్నె విమానాశ్రయంలో వ్యాట్ పన్నును 29% నుండి 16%కి, , రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాలలో 1%కి తగ్గించింది. పన్నులు తగ్గించినప్పటికీ పండుగ సీజన్‌ను ఆసరాగా చేసుకుని విమాన సంస్థలు టికెట్ ధరలను విపరీతంగా పెంచేయడాన్ని పరిగణించిన డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. సాధారణంగా రూ. 4,000 నుండి రూ. 6,000 వరకు ఉండే ఛార్జీలను రూ. 14,000 నుండి రూ. 18,000 వరకు వసూలు చేస్తున్నారని విమర్శించారు. పన్ను తగ్గింపు ద్వారా వచ్చే ఇంధన వ్యయ పొదుపును ప్రయాణికులకు టికెట్ ధరల తగ్గింపు రూపంలో బదిలీ చేస్తామని ఏవియేషన్ కంపెనీలు హామీ ఇచ్చాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ పన్ను రాయితీలు ఇవ్వడం వల్ల తమిళనాడు ప్రభుత్వం ప్రతిఏటా ఎంత పన్ను రాబడిని కోల్పోతోంది?, ప్రయాణికులకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరేలా, కొత్త మార్గాల్లో విమానాలు నడిపేలా ప్రభుత్వం విమాన సంస్థలకు ఏవైనా లక్ష్యాలను నిర్దేశించిందా?, పన్ను ప్రోత్సాహకాల వల్ల ఏవియేషన్ రంగం పొందే లబ్ధి అంతిమంగా సామాన్య ప్రజలకు కూడా అందాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
కురియన్ జోసెఫ్ కమిటీ రద్దుతో పెద్ద ద్రోహం
సాక్షి, చైన్నె : కేంద్ర–రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేసేందుకు గత డీఎంకే ప్రభుత్వ హయాంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీని టీవీకే ప్రభుత్వం రద్దు చేయడంపై ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమిళనాడుకు సీఎం విజయ్ సర్కారు చేసిన అతి పెద్ద ద్రోహం అని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, నిధులు , న్యాయపరమైన అంశాలను అధ్యయనం చేయడానికి మాజీ జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో పరిపాలనా, ఆర్థిక, న్యాయ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీని రద్దు చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉదయ నిధి స్టాలిన్ స్పందిస్తూ ద్రవిడ మోడల్ పాలనలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన కీలక కమిటీని రద్దు చేయడం తమిళనాడు ప్రజలకు చేసిన ద్రోహమని ఉదయనిధి ఖండించారు. తమిళనాడు లా కమిషన్ పనిచేస్తోందనే నెపంతో ఈ ఉన్నత స్థాయి కమిటీని రద్దు చేశారని, రాష్ట్ర హక్కులను కాపాడటానికి ప్రభుత్వ వద్ద అసలు ఏం ప్రణాళిక ఉందని ఆయన ప్రశ్నించారు.


