సాక్షి, చైన్నె: తమిళనాడులోని కళాశాల విద్యార్థుల డిజిటల్ నైపుణ్యాలు , ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ’వెట్రి ల్యాప్‌టాప్ పథకం’ అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయిస్తూ సీఎం విజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి పరిపాలనా ఆమోదం , మార్గదర్శకాలతో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 2026–2027 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ , ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలల్లో ఆర్ట్స్ , సైన్స్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, మెడిసిన్, వెటర్నరీ, ఫిషరీస్, అగ్రికల్చర్, లా చదువుతున్న 1వ, 2వ సంవత్సరం విద్యార్థులు. ఈ పథకానికి అర్హులుగా ప్రకటించారు. అలాగే, 2025–2026లో ల్యాప్‌టాప్‌లు అందుకోలేకపోయిన 3వ , 4వ సంవత్సరం వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు కూడా వర్తింప చేశారు. ఇక ఇంజినీరింగ్ విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి ఇంటెల్ కోర్ 5 జీ లేదా దానికి సమానమైన అత్యాధునిక ల్యాప్‌టాప్‌లను అందించనున్నారు.
స్టీరింగ్ కమిటీ – కొనుగోలు
పథకం అమలును పర్యవేక్షించడానికి సీఎం విజయ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నాణ్యమైన ల్యాప్‌టాప్‌ల సేకరణ బాధ్యతను ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు కి అప్పగిస్తూ ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రపంచ స్థాయి సాంకేతిక పోటీని తట్టుకుని మెరుగైన ఉపాధి పొందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.


