సాక్షి,చైన్నె: తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో వ్యవసాయ కూలీల కొరత తీవ్రమవడంతో సంబా వరి సాగు పనులను పూర్తి చేయడానికి ఉత్తరాది రాష్ట్రాల కూలీలు స్థానిక రైతులకు ఎంతగానో చేయూతనిస్తున్నారు. తిరువారూర్ జిల్లావ్యాప్తంగా 3,49,775 ఎకరాల్లో సంబా సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 2,93,810 ఎకరాల్లో సాగు పూర్తయింది. ఇందులో 1,14,945 ఎకరాల్లో సాంప్రదాయ పద్ధతిలో నాట్లు వేయగా, 1,78,865 ఎకరాల్లో నేరుగా విత్తనాలు చల్లారు. మిగిలిన 55,965 ఎకరాల్లో కూలీల తీవ్ర కొరత కూలీల కారణంగా ఏర్పడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (100 రోజుల పని) ద్వారా తక్కువ పని గంటలకు రూ. 300 దక్కుతుండటంతో, స్థానిక వ్యవసాయ కూలీలు ఆ పనులకే మొగ్గు చూపుతున్నారు.100 రోజుల పని పథకం కొనసాగుతుండటంతో ఇతర ప్రాంతాల (తిరుత్తురైపూండి, కొట్టూరు) నుండి స్థానిక కూలీలను తెచ్చి నాట్లు వేయించడానికి ఎకరానికి దాదాపు రూ. 15 వేలు వరకు ఖర్చవుతోందని రైతులు చెబుతున్నారు.
ముత్తుపేట్టై, మన్నార్గుడి, నీడమంగళం వంటి ప్రాంతాల్లో ఉత్తర రాష్ట్రాల కూలీలు విస్త్తృతంగా వరి నాట్లు వేస్తున్నారు. వీరితో నాట్లు వేయించడానికి ఎకరానికి కేవలం రూ. 5 వేలు మాత్రమే ఖర్చు అవుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం , కూలీల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో, ఉత్తర భారత కార్మికులు తక్కువ ఖర్చుతో సకాలంలో నాట్లు వేయడానికి సహాయపడుతున్నారని స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రంగాలలో తమిళనాడులో దూసుకెళ్తున్న ఉత్తరాది కార్మికులు తాజాగా పొలం బాట పట్టడం విశేషం.


