సాక్షి, చైన్నె : రాష్ట్రంలోని అగస్త్యమలై , మేఘమలై పులి సంరక్షణ కేంద్రాలలోని ఆక్రమణలపై దర్యాప్తు చేయడానికి, అలాగే అటవీ హక్కుల చట్టం కింద దాఖలైన క్లెయిమ్‌లను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఆర్. గవాయ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. 2009లో మేఘమలై ప్రాంతాన్ని తమిళనాడు ప్రభుత్వం వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత అక్కడి నివాసితులను ఖాళీ చేయాలని అటవీ శాఖ ఆదేశించింది. నాలుగైదు తరాలుగా నివసిస్తున్నామని ఖాళీ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మేఘమలై అటవీ ప్రాంతంలో వాణిజ్య పంటల సాగుకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్ మెహతా తిరస్కరించారు. వాణిజ్య పంటల సాగు అనేది సహజంగా లభించే అటవీ ఉత్పత్తుల కిందకు రాదని స్పష్టం చేశారు.
ప్రత్యేక కమిటీ విధివిధానాలు
అటవీ హక్కుల చట్టం, 2006 (సెక్షన్ 2) ప్రకారం కేవలం సాంప్రదాయకంగా అడవుల్లో నివసించే ఆదివాసీలు లేదా సాంప్రదాయ అటవీ నివాసులకు మాత్రమే చట్టపరమైన హక్కులు వర్తిస్తాయి. ఈ కమిటీ మేఘమలై ప్రాంతంలోని నివాసితులలో ఆదివాసీలు ఎవరో, ఆదివాసీయేతరులు ఎవరో స్పష్టంగా అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీకి కేంద్ర ప్రాధికార సంస్థ, తమిళనాడు ప్రభుత్వ ప్రధాన అటవీ సంరక్షణాధికారి సహాయం అందిస్తారు తమిళనాడు ప్రభుత్వం కమిటీ నివేదికలను ధ్రువీకరించి, సీల్డ్ కవర్‌లో సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా పడింది.


