వివాదాల్లోకి పెరియార్‌ విజ్ఞాన కేంద్రం | - | Sakshi
Sakshi News home page

వివాదాల్లోకి పెరియార్‌ విజ్ఞాన కేంద్రం

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

పుస్తకాల కొనుగోలులో అక్రమాలు

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల సమరం

విచారణ జరుపుతామన్న రాజ్‌మోహన్‌

సాక్షి, చైన్నె : కోయంబత్తూరులో బ్రహ్మాండంగా నిర్మించిన పెరియార్‌ విజ్ఞాన కేంద్రం వివాదాల్లోకి ఎక్కింది. పుస్తకాల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలు అధికార, ప్రతి పక్షాల మధ్య మాటల సమరానికి శుక్రవారం దారి తీశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని సమాచార మంత్రి రాజ్‌ మోహన్‌ ప్రకటించారు. కోయంబత్తూరు గాంధీపురంలో గత డీఎంకే హయాంలో రూ.300 కోట్లతో ద్రవిడ సిద్ధాంత కర్త పెరియార్‌ పేరిట బ్రహ్మాండ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తికావడంతో గత నెలలో సీఎం విజయ్‌ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ కేంద్రానికి పుస్తకాల కొనుగోళ్లలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపనలు వెల్లువెత్తాయి. దీనిపై సీఎం విజయ్‌ తొలుత ట్వీట్‌ చేయడంతో వ్యవహారం వివాదానికి దారితీసింది.

అవినీతికి మూలం డీఎంకే

సీఎం విజయ్‌ స్పందిస్తూ తమిళ భాషను, మట్టిని, గౌరవాన్ని కాపాడేది మేమేనని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసే వర్గం ఎల్లప్పుడూ అవినీతిమయంగానే ఉంటుందని డీఎంకేను ఉద్దేశించి తెలిపారు. పెరియార్‌ పేరుతో మేధో ప్రపంచాన్ని నిర్మిస్తామని చెప్పిన డీఎంకే, నాసిరకమైన, నకిలీ పుస్తకాలను కొనుగోలు చేసి అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పుస్తకాల సిఫార్సు కమిటీలోని సభ్యుడైన ప్రొఫెసర్‌ పెరుమాళ్‌ మురుగన్‌ ఈ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తెచ్చారని, ఆయనను అభినందించాలని పేర్కొన్నారు. మున్సిపల్‌, టాస్మాక్‌, టెండర్లలోనే కాకుండా చివరికి పిల్లల చదువుకు, జ్ఞానానికి ఉపయోగపడే గ్రంథాలయాల్లో కూడా డీఎంకే అవినీతికి పాల్పడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో సీపీఎం నేత షణ్ముగం స్పందిస్తూ డీఎంకే ప్రభుత్వ హయాంలో 7 ఎకరాల్లో రూ.300 కోట్లతో 7 అంతస్తుల భవనంగా నిర్మించిన ఈ కేంద్రం గత నెల 16న ప్రారంభమైందని గుర్తుచేశారు. గ్రంథాలయానికి పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన ప్రభుత్వ నియమాలను, మార్గదర్శకాలను గాలికి వదిలేసి, ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. తమిళ పండితులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, లైబ్రరీలోని అన్ని పుస్తకాలను పరిశీలించి నకిలీ పుస్తకాలను వెంటనే తొలగించాలని, అక్రమాలపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వి ది లీడర్స్‌ సంస్థ వ్యవస్థాపకుడు అన్నామలై స్పందిస్తూ గ్రంథాలయాలకు పుస్తకాల కొనుగోలు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోందన్నారు. పెరియార్‌ విజ్ఞాన కేంద్రం కోసం ప్రచురణకర్తల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయడంలో తీవ్ర అవినీతి జరిగిందని ఆరోపించారు. పుస్తకాల కొనుగోలుకు సంబంధించిన సిఫార్సు కమిటీ నివేదిక, సిఫార్సు చేసిన పుస్తకాల జాబితా, పర్చేజ్‌ ఆర్డర్లు, ఇన్‌వాయిస్‌లు, డెలివరీ పత్రాలు, ధ్రువీకరణ కమిటీ నివేదికలను బహిరంగపరచాలన్నారు.

డీఎంకే ఎదురు దాడి

ఈ ఆరోపణలపై డీఎంకే తన అధికారిక సామాజిక మాధ్యమం ఎక్స్‌ పేజి ద్వారా ఘాటుగా స్పందించింది: ‘పెరియార్‌ అగల్‌ విలక్కు, ఫీనిక్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ద్వారా వచ్చిన నకిలీ పుస్తకాలపై మాత్రమే జూన్‌ నెల ముద్ర ఉందనీ, ఆ తేదీ టీవీకే నాయకుడు విజయ్‌ పుట్టినరోజు అని గుర్తు చేసింది. అదే పెరియార్‌ కేంద్రంలో ఉన్న ఫ్రమ్‌ వోల్గా టు గంగా వంటి ఇతర ప్రామాణిక పుస్తకాలపై డీఎంకే ప్రభుత్వ కాలపు మార్చి నెల ముద్ర ఉందన్నారు. మరి ఆ నకిలీ పుస్తకాలను ఎప్పుడు, ఎవరి హయాంలో కొనుగోలు చేశారు? ఆ కమీషన్లు ఎవరికి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించింది. ధరల పెరుగుదల, విద్యుత్‌ కోతలు, జాలర్ల మరణాలు వంటి ప్రధాన ప్రజా సమస్యలపై మాట్లాడని విజయ్‌, డీఎంకే నాయకుడు స్టాలిన్‌ కోయంబత్తూరు పెరియార్‌ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి ప్రశంసలు పొందిన తర్వాతే ఈ ఆరోపణలతో ముందుకు వచ్చారని విమర్శించింది. గ్రంథాలయంలోని పుస్తకాల ఎంపిక కమిటీలో ఉన్న ఒక ప్రముఖ రచయిత, పుస్తకాల ప్రచురణకర్తలు, రచయితల పేర్ల స్థానంలో ఉన్న వివరాలను చూసి ఆశ్చర్యపోయిన తర్వాతే అసలు విషయం వెలుగులోకి వచ్చిందా అని డీఎంకే నిలదీసింది. గత తమ ప్రభుత్వ హయాంలో పుస్తకాల కొనుగోళ్లు అత్యంత పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేసింది. మంత్రి సంపత్‌కుమార్‌, రాజ్‌ మోహన్‌ స్పందిస్తూ పెరియార్‌ విజ్ఞాన కేంద్రం పుస్తకాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చిన మాట నిజమేనని, పుస్తకాల కొనుగోలులో అవకతవకలపై విచారణ జరుపుతామన్నారు. ఇది రుజువైతే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక సిట్‌ను రంగంలోకి దించాలని అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement