విషాదంలో కాశిమేడు | - | Sakshi
Sakshi News home page

విషాదంలో కాశిమేడు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

● ఆంధ్రా తీరంలో ఏడుగురు మృతి ● ఇద్దరి కోసం గాలింపు

సాక్షి, చైన్నె : చైన్నెలోని కాశిమేడు ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగింది. ఇక్కడి నుంచి చేపల వేటకు వెళ్లిన వారిని మురసు తుపాన్‌ రూపంలో ప్రమాదం మింగేయడం జాలర్లను కన్నీటి సంద్రంలో ముంచింది. ఆంధ్రా తీరంలో ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా కాశిమేడుకు చెందిన వారే కావడంతో తీవ్ర విషాదం అలుముకుంది. అక్టోబర్‌ 29న కాశిమేడులోని సెల్వళగన్‌కు చెందిన చిన్న మోటారు పడవలో మత్స్యకారులు సూర్య, కుప్పన్‌, మురుగన్‌, మోహన్‌, అరవింద్‌ ధన్‌, రాజేష్‌, విజయకాంత్‌, కుప్పుస్వామి, నారాయణ్‌ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో ఇంజిన్‌ పడవ మొరాయించడంతో తుపాను తీవ్రతకు ప్రకాశం జిల్లా కొత్తపట్నం తీరానికి 5 కిలోమీటర్ల దూరంలో పడవ బోల్తా పడింది.

7 మృతదేహాల వెలికితీత

ఇప్పటి వరకు లభించిన 7 మృతదేహాల్లో మోహన్‌, మురుగన్‌, విజయకాంత్‌, సూర్య, కుప్పుస్వామిని గుర్తించారు. మిగిలిన ఇద్దరి మృతదేహాలు బాగా ఛిద్రమైన స్థితిలో లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం నావికాదళం, కోస్ట్‌ గార్డ్‌ బోట్లు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

సహాయక చర్యల పర్యవేక్షణ

ఆర్థిక మంత్రి మరియా విల్సన్‌ మత్స్యశాఖ అధికారులతో కలిసి స్వయంగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు 7 మృతదేహాలను వెలికితీశామన్నారు. వీటిని చైన్నెకి తరలించే చర్యలు వేగవంతం చేశామన్నారు. మిగిలిన ఇద్దరి కోసం నౌకాదళ నౌక సాయంతో గాలింపు జరుగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కలెక్టర్‌తో పాటు మత్స్యశాఖ అధికారులు సహకారం అందిస్తున్నారని తెలిపారు.

చైన్నెకి చేరిన మృతదేహాలు

సూర్య, విజయకాంత్‌, మోహన్‌, మురుగన్‌, కుప్పుస్వామి, మరో ఇద్దరు మృతదేహాలను ఆంధ్రా నుంచి చైన్నెలోని కాశిమేడుకు తీసుకొచ్చారు. మంత్రి శ్రీనాథ్‌, రాయపురం ఎమ్మెల్యే ఎల్‌.ఎ.విజయ్‌ దాము, డీఎంకే నాయకులు ఆర్‌.డి.శేఖర్‌, కె.పి.శంకర్‌ తదితరులు మరణించిన మత్స్యకారుడు మోహన్‌ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇస్తూ, రూ.2 లక్షల సహాయక చెక్కును అందజేశారు. డీఎంకే తరఫున కూడా రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు.

అధికారుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం

పడవ నీట మునుగుతున్న సమయంలో అధికారులకు సమాచారం అందించినా, వారు తక్షణమే స్పందించి హెలికాప్టర్లు, నౌకల ద్వారా గాలింపు చేపట్టలేదని, అబద్ధాలు చెప్పి కాలయాపన చేశారని మత్స్యకారుడు మోహన్‌ కుటుంబ సభ్యులు వాపోయారు. పడవ యజమాని భద్రతా నిబంధనలు పాటించడంలో విఫలమైనట్లు గుర్తించామని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని అధికారులు వెల్లడించారు. మృతదేహాలకు వేర్వేరుగా అంత్యక్రియలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement