సాక్షి, చైన్నె : టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయడానికి రూ.30 కోట్ల బేరసారాలు (హార్స్ ట్రేడింగ్) జరిపారనే ఆరోపణలపై అన్నాడీఎంకే నాయకుడు, మదురై మాజీ డిప్యూటీ మేయర్ పి.ఎం.మన్నన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి విచారిస్తున్నారు. దీనిపై మదురై సెంట్రల్ నియోజకవర్గం టీవీకే ఎమ్మెల్యే మదర్ బతురుద్దీన్ (అలియాస్ ముస్తఫా) విలేకరులతో మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి అన్నాడీఎంకే తరఫున ఒక వ్యక్తి తనతో ఫోన్‌లో మాట్లాడారని వెల్లడించారు. ఓటింగ్‌కు ముందు రూ.15 కోట్లు, తర్వాత మరో రూ.15 కోట్లు ఇస్తామని ఆశ చూపాడని తెలిపారు. తనతో బేరసారాలు జరిపిన వ్యక్తి పి.ఎం.మన్నన్ అని ఎమ్మెల్యే ముస్తఫా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మదురై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరిపి మన్నన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆరోగ్య రాజ్, ఇన్‌స్పెక్టర్ వీరమ్మాళ్ నేతృత్వంలో ఆయనను తీవ్రంగా విచారిస్తున్నారు.
మదురైలో ఉద్రిక్తత
మాజీ డిప్యూటీ మేయర్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారనే సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో మదురై ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. మాజీ మంత్రి సెల్లూరురాజుతో పాటుగా పలువురు నాయకులకు మన్నన్‌ను కలిసే అవకావం కూడా ఇవ్వలేదు. సెల్లూరు రాజు మీడియాతో మాట్లాడుతూ టీవీకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఇదంతా తమను అడ్డుకునేందుకు, బెదిరించేందుకు జరుగుతున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు.


