అన్బిల్‌ మహేష్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

అన్బిల్‌ మహేష్‌ జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

సాక్షి, చైన్నె : రూ.400 కోట్లకు పైగా ఆర్థిక మోసం కేసులో అరెస్ట్‌ అయిన డీఎంకే మాజీ మంత్రి అన్బిల్‌ మహేష్‌ జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 18వ తేదీ వరకు పొడిగిస్తూ చైన్నె అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్‌ పాఠశాలలకు అక్రిడిటేషన్‌, అనుమతులు ఇప్పిస్తామని నమ్మించి రూ.400 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్లు అన్బిల్‌ మహేష్‌పై చైన్నె సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు అతన్ని గత నెల 26న అరెస్టు చేసి పుళల్‌ జైలుకు తరలించారు. శుక్రవారంతో ఆయన రిమాండ్‌ కాలం ముగియడంతో జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చైన్నె అవినీతి నిరోధక ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎల్‌.ఎస్‌.సత్యమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి ఆయన కస్టడీని ఈ నెల 18 వరకు పొడిగించారు. అన్బిల్‌ మహేష్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పూర్తయిందని, తీర్పును నవంబర్‌ 10కి వాయిదా వేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు!

సాక్షి, చైన్నె : తమిళనాడులో స్థానిక సంస్థల (గ్రామీణ, పట్టణ) ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. తమిళనాడులోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు చెందిన కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్ల పదవీకాలం ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుతం జనాభా గణన పనులు జరుగుతున్న నేపథ్యంలో మార్చి 2027 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా వార్డుల సరిహద్దుల నిర్ణయం, రిజర్వేషన్ల ఆధారంగా వార్డుల పునర్విభజన పనులు చేపట్టారు. పుదుక్కోట్టై, కళ్లకురిచ్చి, తెన్‌కాశి జిల్లాల్లోని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో సభ్యుల సంఖ్య నిర్ధారణపై సంప్రదింపులు జరిగాయి. చైన్నె (అరుంబాక్కం)లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ జ్యోతి నిర్మల అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు మధుసూదన్‌ రెడ్డి, సమీన్‌ ఎన్‌, కె.పి. కార్తికేయన్‌, షణ్ముగ నాథన్‌ తదితరులు హాజరై స్థానిక సంస్థలకు ఎన్నుకోవాల్సిన సభ్యుల సంఖ్యను నిర్ధారించి ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని చైన్నె మినహా తక్కిన 37 జిల్లాల్లోని పట్టణ పంచాయతీలు, గ్రామ పంచాయతీల పదవీ కాలం ముగిసింది. ఈ దృష్ట్యా అన్నింటికీ మార్చిలో పలు విడతలుగా ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు చేస్తున్నారు.

ఖనిజ వనరుల

అక్రమ రవాణాపై కన్నెర్ర

సాక్షి, చైన్నె : విరుదునగర్‌ జిల్లాలోని క్వారీల్లో నిబంధనల ఉల్లంఘనలు, ఖనిజ వనరుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి పర్యవేక్షణ బృందానికి డిప్యూటీ తహసీల్దార్‌ నాయకత్వం వహిస్తారు. ఈ బృందంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, విలేజ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, విలేజ్‌ అసిస్టెంట్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన జోనల్‌ ఆఫీసర్‌, పోలీస్‌ స్పెషల్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌, ప్రజా పనుల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సభ్యులుగా ఉంటారు. అలాగే రాజపాళయం, శ్రీవిల్లిపుత్తూరు, వత్తిరైరిపు, శివకాశి, వెంబక్కోట్టై, సాత్తూరు, విరుదునగర్‌, అరుప్పుకోట్టై, కారియాపట్టి, తిరుచూలి తదితర తాలూకాల్లో ఏడుగురు సభ్యుల చొప్పున 4 బృందాలను నియమించి గస్తీని ముమ్మరం చేశారు. అక్రమ ఖనిజ తవ్వకాలు, రవాణాపై వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సంఘటనా స్థలాన్ని సందర్శించడం, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు నిర్వహించడం, క్వారీలు, ఖనిజ నిల్వ కేంద్రాలు, ఎగుమతి ప్రాంతాల్లో నిబంధనలు, అనుమతులు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం వంటి పనులు ఈ బృందాలకు కేటాయించారు. ఈ 40 బృందాల పనితీరును, రోజువారీ నివేదికలను సబ్‌–కలెక్టర్లు, ఆర్డీవోలు నిశితంగా పరిశీలించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement