వెట్రి గృహ పథకానికి రూ.3,500 కోట్లు | - | Sakshi
Sakshi News home page

వెట్రి గృహ పథకానికి రూ.3,500 కోట్లు

Nov 7 2026 1:24 AM | Updated on Nov 7 2026 1:24 AM

● 70 వేల ఇళ్లు నిర్మించాలని నిర్ణయం ● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, చైన్నె : తమిళనాడులో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెట్రి గృహ నిర్మాణ పథకం (వెట్రి వీడు పథకం)ను తీసుకువచ్చింది. ఈ ఏడాది ఈ పథకం కింద 70 వేల ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు రూ.3,500 కోట్లు కేటాయించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.2,600 కోట్లు, గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం అందించే గ్రాంటు నుంచి రూ.900 కోట్లు వినియోగిస్తారు. వెట్రి తమిళనాడు దార్శనిక ప్రణాళిక కింద గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 3 లక్షల నుంచి 5 లక్షల కొత్త ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 70 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. లబ్ధిదారు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ ఇల్లు కనీసం 360 చదరపు అడుగుల నుంచి గరిష్టంగా 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో వంటగదితో, కాంక్రీట్‌ పైకప్పుతో నిర్మించాల్సి ఉంటుంది.

అర్హతలు – ప్రాధాన్యత

గుడిసెలు, మట్టి గోడలు, అస్థిరమైన గడ్డి కప్పు ఉన్న ఇళ్లలో నివసిస్తున్న పేద కుటుంబాలకు ఈ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఇంటింటి గణన నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇళ్ల నిర్మాణానికి అదనపు నిధులు అవసరమైతే తమిళనాడు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ నిధి ద్వారా 6 శాతం వడ్డీతో రూ.30 వేల వరకు సామాజిక పెట్టుబడి నిధి రుణం పొందవచ్చు. అలాగే సహకార లేదా వాణిజ్య బ్యాంకుల ద్వారా సంవత్సరానికి 3 శాతం వడ్డీ రాయితీతో రూ.లక్ష వరకు గృహ రుణం (గరిష్టంగా 10 సంవత్సరాల కాలానికి) పొందడానికి అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రైవేట్‌ టాయిలెట్ల నిర్మాణం కూడా అవకాశం కల్పిస్తారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమై, జనాభా లెక్కల పరిధిలోకి రాని అర్హులైన లబ్ధిదారుల కోసం ప్రతి జిల్లాకు కేటాయించే ఇళ్లలో 5 శాతం జిల్లా కలెక్టర్‌ విచక్షణ మేరకు కేటాయించనున్నట్టు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement