1 నుంచి ఇసుక ట్రక్కుల సమ్మె | - | Sakshi
Sakshi News home page

1 నుంచి ఇసుక ట్రక్కుల సమ్మె

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

కొరుక్కుపేట: నవంబర్‌ 1వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్టు తమిళనాడు ఇసుక, ఎంసాండ్‌ ట్రక్కుల యజమానుల సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఇ.యువరాజ్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ తమిళనాడులోని చాలా క్రషర్‌ క్వారీల్లో ట్రక్కులు ఓవర్‌లోడ్‌ అయినప్పుడు మాత్రమే వాటిని ఆపాలన్నారు. ట్రక్కుల ఓవర్‌ లోడింగ్‌ను తగ్గిస్తే ధరలు పెరుగుతాయని ప్రభుత్వమే చెప్పడం వింతగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఓవర్‌ లోడింగ్‌ కేసులు నమోదు చేయడం ఆపాలని, ఈ కొత్త ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకురావడానికి నవంబర్‌ 1వ తేదీ నుంచి 4 రోజుల పాటు ట్రక్కుల సమ్మెకు దిగాలని నిర్ణయించామన్నారు. అధిక లోడ్లను స్వీకరించకూడదని ఒక నిర్ణయాత్మక నిర్ణయం కూడా తీసుకుంది. 4వ తేదీ వరకు ఇసుక, ఎంసాండ్‌ ట్రక్కులు చైన్నె, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు, రాణిపేట, కడలూరు, వెల్లూరు జిల్లాల్లో తిరగవని స్పష్టం చేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌ను

దూషించిన టీవీకే నేత అరెస్టు

అన్నానగర్‌: చెంగల్పట్టు నగర మున్సిపల్‌ కమిషనర్‌ను దూషించిన టీవీకే నాయకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చెంగల్పట్టు నగర మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. వీటిలో సేకరించిన చెత్తను 10 సంవత్సరాలకు పైగా చెంగల్పట్టు పచ్చయమ్మన్‌ ఆలయ సమీపంలోని చెత్త డంప్‌లో వేస్తున్నారు. పచ్చయమ్మన్‌ ఆలయ ప్రాంతంలో చెత్త పారవేయడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ 27వ తేదీన పచ్చయమ్మన్‌ ఆలయ ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి వెళ్లారు. అప్పుడు అక్కడికి వచ్చిన అదే ప్రాంతానికి చెందిన టీవీకే నాయకుడు ఆంథోని (34) కమిషనర్‌ సుమను అసభ్యకరంగా దూషించాడు. ఆమె ఆంథోనిపై చెంగల్పట్టు పోలీస్‌ విజిలెన్స్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెంగల్పట్టు నగర పోలీసులు దర్యాప్తు నిర్వహించి ఆంథోనిని అరెస్టు చేశారు. చెంగల్పట్టు క్రిమినల్‌ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఆంథోనిపై పలు ఇసుక స్మగ్లింగ్‌ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

తిరువళ్లూరు: స్నేహితుడి కొడుకు జన్మదిన వేడుకలకు బ్యానర్‌ కడుతూ విద్యుత్‌ షాక్‌కు గురైన యువకుడు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పుట్లూరు రామాపురం అంకాళపరమేశ్వరి ఆలయ వీధికి చెందిన నందగోపాల్‌ కుమారుడు అరవిందన్‌(34) తన కొడుకు జన్మదినం కావడంతో అరవింద్‌ స్నేహితుడైన కాకలూరుకు చెందిన దీపరాజ్‌ బ్యానర్‌ కట్టే పనుల్లో నిమగ్నమయ్యాడు. బ్యానర్‌ కట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ వైర్‌కు బ్యానర్‌ తగలడంతో కింద పడ్డాడు. స్థానికులు రక్షించి అతడిని చికిత్స నిమిత్తం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.

శ్రీవారి దర్శనానికి 6 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 62,811 మంది స్వామిని దర్శించుకున్నారు. 19,499 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.20 కోట్లు వచ్చాయి. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 6 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు. ఇదిలా ఉండగా దర్శనం టికెట్లు ఉన్న వారు కేటాయించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ తెలిపింది.

వేదవల్లి తాయారుకు

ఘనంగా ఊంజల్‌ సేవ

నాగలాపురం: మండలంలోని టీటీడీ అనుబంద శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ వేదవల్లి తాయారుకు ఘనంగా ఊంజల్‌ సేవ నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు శుక్రవారం వేకువజామున ఆలయాన్ని తెరిచి స్వామి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు చేశారు. అనతరం వేదవల్లి తాయారుకు ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వేదవల్లి తాయారును దర్శించుకున్నారు. సాయంత్రం 7 గంటలకు శ్రీ వేదవల్లి తాయారు ఉత్సవమూర్తులను వివిద రకాల పూలు, ఆభరణాలతో అలంకరించి తిరుచ్చి వాహనంపై అధిష్టింపజేశారు. తదుపరి ఊంజల్‌ సేవ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement