కొరుక్కుపేట: జీఆర్టీ జ్యువెలర్స్ తన వార్షిక సీఎస్ఆర్ కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణ, ఒక విద్యా సంస్థకు రూ.2.28 కోట్ల విలువైన ఆర్థిక సహాయాన్ని అందించింది. ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందిన జీఆర్టీ జ్యువెలర్స్ తన వార్షిక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల ద్వారా సామాజిక సంక్షేమానికి కృషిచేస్తోంది. ఇందులో భాగంగా చైన్నెలోని జీఆర్టీ గ్రాండ్ హోటల్లో శుక్రవారం వార్షిక కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమంలో భాగంగా జీఆర్టీ జ్యువెలర్స్ ఆరోగ్య సంరక్షణ విద్యను అభివృద్ధి చేయడానికి అంకితమైన సంస్థలకు ఆర్థిక సహా యం అందించింది. సుదీర్ఘకాలంగా విద్యాసంస్థగా ఉన్న కుంభకోణంలోని టౌన్ హైస్కూల్, పాఠశాల భవన పునరుద్ధరణ, తరగతి గదుల నిర్మాణం కోసం రూ.95 లక్షలు మంజూరు చేశారు. క్యాన్సర్ రోగులకు కరుణామయ సంరక్షణను మరింత బలోపేతం చేసేందుకు, అంబత్తూర్‌లోని ఆనందం ట్రస్ట్‌కు క్యాన్సర్ పాలియేటివ్ కేర్ సెంటర్ నిర్మాణం కోసం రూ.25 లక్షలు ఇచ్చారు. ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అవసరమైన కిడ్నీ సంరక్షణ, చికిత్సను పొందేందుకు సహాయపడేందుకు, ట్యాంకర్ ఫౌండేషన్‌కు కిడ్నీ మార్పిడి సహాయం, ఫిస్టులా చికిత్స, మందుల కోసం రూ.25 లక్షలు మంజూరుచేశారు. మహిళలు, పిల్లల సాధికారత, సంక్షేమానికి అంకితమైన ఆంధ్ర మహిళా సభ, తన నర్సింగ్, గైనకాలజీ, రిసెప్షన్ బ్లాక్ పునరుద్ధరణ కోసం రూ.83 లక్షలు ఇచ్చింది. జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ మాట్లాడుతూ సమాజ సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఉంటుందని తెలిపారు. తమ తండ్రి, జీఆర్టీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ జి.రాజేంద్రన్ నుంచి సంక్రమించిన సంప్రదాయం, ప్రతి సంవత్సరం ఈ వారసత్వాన్ని కొనసాగించే అదృష్టం దక్కడం సంతోషంగా ఉందన్నారు. మరో జీఆర్టీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ ‘మా వినియోగదారుల ప్రేమ, నమ్మకం వల్లే జీఆర్టీ జ్యువెలర్స్ 68 షోరూమ్‌లకు విస్తరించగలిగిందన్నారు.


