సాక్షి, చైన్నె : ఏడేళ్ల ప్రాయంలో పడవలో రక్షించబడిన శ్రీలంకకు చెందిన జాయ్ (37) అనే యువకుడు తనకు గుర్తింపు కార్డు జారీ చేయాలని, లేదా తన సొంత దేశానికి పంపాలని కోరుతూ ఈరోడ్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కన్నీళ్లతో వినతి పత్రం సమర్పించాడు. బాధితుడు జాయ్ తెలిపిన వివరాల మేరకు .. ‘మా నాన్న జాలరి. 1997లో నేను పడవలో నిద్రిస్తుండగా కొందరు నన్ను రామేశ్వరానికి తీసుకువచ్చారు. ఆ పడవలో నా తల్లిదండ్రులు లేరు. భారత సైన్యం మమ్మల్ని పట్టుకుని మండపంలోని శ్రీలంక తమిళుల పునరావాస శిబిరానికి తరలించింది’ అని వివరంచారు. ఏడేళ్ల వయసులో ఆశ్రమానికి తరలించగా 2014లో పెద్దయ్యాక తిరిగి మండపం శిబిరానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అధికారులు తల్లిదండ్రుల వివరాలు, గుర్తింపు కార్డులు అడగ్గా ఏమీ తెలియక శ్రీలంకకు వెళ్తానని చెప్పడంతో పుళల్ జైలులో ఉంచారని పేర్కొన్నారు. ఏడాదికి పైగా జైలులో ఉన్న తర్వాత కోర్టు శ్రీలంకకు పంపాలని ఆదేశించినా, మళ్లీ మండపం శిబిరానికే పరిమితం చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. శిబిరం నుంచి బయటకు వచ్చి చైన్నెలోని శ్రీలంక రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించినా తల్లిదండ్రులతో కలిపే చర్యలు తీసుకోలేదన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవనోపాధి లేక, గుర్తింపు కార్డు లేక తీవ్ర మనస్తాపంతో పలుమార్లు ఆత్మహత్యకు కూడా యత్నించినట్లు వాపోయారు. ప్రస్తుతం భవానీ సంగమేశ్వర ఆలయంలో ఉంటూ అక్కడ దొరికే ఆహారం తింటున్నానని, జీవనోపాధి కోసం కొంతమందికి ఫుట్బాల్ నేర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. తనపై కరుణ చూపి, గుర్తింపు కార్డు ఇప్పించండి అని వేడుకున్నారు. ఈరోడ్ ఎస్పీ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న క్యూ బ్రాంచ్ పోలీసులు యువకుడు జాయ్ వద్ద విచారణ జరుపుతున్నారు.


