ప్రొఫెసర్‌ కలైయరసన్‌ అరెస్టు.. విడుదల | - | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ కలైయరసన్‌ అరెస్టు.. విడుదల

Oct 30 2026 2:15 AM | Updated on Oct 30 2026 2:15 AM

● వివాదంగా మారిన వ్యవహారం ● ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం

సాక్షి, చైన్నె: చైన్నెలోని మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్‌ ఎ. కలైయరసనన్‌ను పోలీసులు వేకువ జామున తీసుకెళ్లి విచారణ పేరుతో వేధించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఒక ప్రఖ్యాత విద్యావేత్తను మఫ్టీలో వచ్చిన పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, భయబ్రాంతులకు గురిచేయడాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. షణ్ముగం, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టి.టి.వి. దినకరనన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు.

ఫాసిజంలో బీజేపీని మించిపోతున్నారు

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రచురించిన ది ద్రవిడియన్‌ మోడల్‌ పుస్తకరచయిత, జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, తమిళనాడు వాతావరణ మార్పుల కమిటీ సభ్యుడైన ప్రొఫెసర్‌ కలైయరసన్‌ను ఏ నేరం చేయకపోయినా అక్రమంగా అరెస్టు చేయడం తీవ్ర దిగ్భ్రాంతికరం అని డీఎంకే అధ్యక్షుం ఎంకే స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర చరిత్ర లేని ఒక విద్యావేత్తను పోలీసులు ఈడ్చుకెళ్లడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. విమర్శలను తట్టుకోలేక విద్యావేత్తలను భయపెడుతున్న ఈ ప్రభుత్వం ఫాసిజంలో బీజేపీని కూడా మించిపోయిందన్నారు.ఈ ఘటనపై సీఎం, పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమ్మమక్కల్‌ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ స్పందిస్తూ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఆధారాలతో మాట్లాడడమే ప్రొఫెసర్‌ చేసిన నేరమా?, ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకు ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వ చర్యలు దాని పతనానికి నాంది పలుకుతాయన్నారు. విచారణ పేరుతో తెల్లవారుజామున పోలీసులు ప్రొఫెసర్‌ను వేధించడం అరాచకంగా పేర్కొన్నారు. సీఎం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీపీఎం నేత షణ్ముగం స్పందిస్తూ, ప్రొఫెసర్‌ కలైయరసన్‌ ఒక ప్రముఖ ఆర్థికవేత్త. తనకు ఇన్‌స్ట్రాగామ్‌ ఐడీ లేదని మొరపెట్టుకున్నా వినకుండా పోలీసులు ప్రవర్తించిన తీరు ఆయనను భయపెట్టడానికే అని స్పష్టమవుతోందన్నారు. ఈ అక్రమ అరెస్టుకు బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ప్రొఫెసర్‌ కలైయరసన్‌

అసలు ఏం జరిగింది?

ఉదయం 5 గంటల ప్రాంతంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు ప్రొఫెసర్‌ కలైయరసన్‌ ఇంట్లోకి చొరబడి, ఆయన సెల్‌ ఫోన్‌నను స్వాధీనం చేసుకుని బలవంతంగా వాహనంలో తీసుకెళ్లారు. పల్లవరం ఎమ్మెల్యేపై ఓ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పరువు నష్టం కలిగించే పోస్టు పెట్టారని, అందులో ప్రొఫెసర్‌ ఫొటో ఉందని విచారణ నెపంతో ఆయనను గంటల పాటు తిప్పి, చివరకు ఇంటి వద్ద వదిలేశారు. దీనిపై స్పందించిన ప్రొఫెసర్‌ కలైయరసన్‌, తనకు అసలు ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాయే లేదని, ఎవరో తన ఫొటోను దుర్వినియోగం చేశారని స్పష్టం చేశారు.ఆయన్ను అరెస్టు చేసి తీసుకెళ్లడం, మళ్లీ వదలి పెట్టడం వివాదాంశంగామారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement