డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు.. రేపు
కొరుక్కుపేట: తమిళనాడులో శాంతిభద్రతల పరిస్థితి, మహిళలు , పిల్లలకు భద్రత లేకపోవడం, పెరుగుతున్న ధరలను ఖండిస్తూ డీఎంకే మహిళా సంఘం తరపున నిరసన శనివారం జరుగనున్నాయి. తమిళనాడులో హత్య, దోపిడీ మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నేరాలు పెరగడం వల్ల శాంతిభద్రతలు చాలా వరకు క్షీణించాయి. మహిళలపై హింస, పిల్లల అపహరణలు విపరీతంగా పెరిగాయి . ఈ ప్రభుత్వం తమిళనాడును అసురక్షిత రాష్ట్రంగా మార్చింది. తమిళనాడును అసురక్షిత రాష్ట్రం అనే అగాథంలోకి నెట్టిన టీవీకే ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. డీఎంకే మహిళా విభాగం తరపున శనివారం ఉదయం 10 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు జరగనున్నాయి. చైన్నె ఉత్తర జిల్లా తరపున కనిమొళి ఎంపీ నిరసనలో పాల్గొని మాట్లాడనున్నట్లు పేర్కొన్నారు.
నైపుణ్యాల పెంపే లక్ష్యం
కొరుక్కుపేట: నాణ్యమైన విద్య, నైపుణ్యాల పెంపు,వృత్తి ఆధారిత అభ్యాస కార్యక్రమాల ద్వారా యువతులకు సాధికారత కల్పించడానికి ఎస్‌కేపీసీ కట్టుబడి ఉందని ఆ కళాశాల యాజమన్యం పేర్కొంది. యూనిసెఫ్ పాస్‌పోర్ట్ టూ ఎర్నింగ్ (పీ2ఈ) కార్యక్రమం ద్వారా యువత నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడంలో శ్రీ కన్యక పరమేశ్వరి మహిళా కళాశాల తన అంకితభావం నిబద్ధతకు గాను, గ్లోబల్ అండర్‌స్టాండింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (జీయూఎస్‌డీ) సహకారంతో ఆడేషియస్ డ్రీమ్స్ ఫౌండేషన్ నుండి ’సంస్థాగత శ్రేష్ఠత( ఇనిస్టిట్యూషనల్ ఎక్స్‌లెన్స్) గుర్తింపును పొందింది. యువతకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానాన్ని అందించి, వారి ఉపాధి అవకాశాలను పెంచి, భవిష్యత్ వృత్తి అవకాశాలకు వారిని సిద్ధం చేయడంపై దృష్టి సారించే యూనిసెఫ్ పాస్‌పోర్ట్ టూ ఎర్నింగ్ కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ఈ కళాశాల సులభతరం చేసిందని నిర్వాహకులు పేర్కొన్నారు.
రెండు బైకులు ఢీ – ఇద్దరి మృతి
అన్నానగర్: పడప్పై సమీపం అథనూర్ ప్రాంతానికి చెందిన నారాయణన్ (42) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతను బుధవారం రాత్రి అథనూర్ లేక్ రోడ్ మీదుగా మోటార్ సైకిల్ పై కిరాణా దుకాణానికి వెళ్లాడు. అదే సమయంలో చైన్నెకి చెందిన లోకేష్ (26) గుడువాంజేరి నుండి మన్నివాక్కం వైపుగా మోటార్ సైకిల్ పై ఎదురుగా వచ్చాడు. అకస్మాత్తుగా, ఈ రెండు మోటార్ సైకిళ్లు వేగంగా ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మోటార్ సైకిళ్లపై ప్రయాణిస్తున్న నారాయణ్, లోకేష్ వాహనం నుండి ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిద్దరినీ రక్షించి చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొద్దిసేపట్లో నారాయణ్, లోకేష్ ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. మణిమంగళం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని పెద్దమ్మ హత్య
తిరువొత్తియూరు: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని పెద్దమ్మను హత్య చేసిన చెల్లెలి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుకుడి కందన్ కాలనీ 3వ వీధి పశ్చిమ ప్రాంతానికి చెందిన చిత్తిరైవేల్ భార్య శశికళ ( 47). బుధవారం ఆమె హత్యకు గురయ్యారు. అంతేకాకుండా ఆమె ధరించిన 4 సవర్ల బంగారు నగలు కూడా దోచుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన శశికళ చెల్లెలి కొడుకు విగ్నేష్ అలియాస్ మునీష్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 4 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకుని రహస్య ప్రదేశంలో విచారణ చేపట్టారు.
తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా
తిరువొత్తియూరు : సేలంలో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో జాతీయ జెండాను తల కిందులుగా కట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. సేలం మహాత్మా గాంధీ క్రీడా మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి 67వ గణతంత్ర దినోత్సవ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి విజయ్ తమిళన్ పార్తీపన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఆ సమయంలో జాతీయ జెండాను సరిగ్గా కట్టకపోవడం వల్ల కాషాయం, తెలుపు రంగు భాగాలు ఊడిపోయి కిందకు వేలాడాయి. దీనివల్ల పచ్చ రంగు పైకి వచ్చి, జాతీయ జెండా తలకిందులుగా ఎగిరింది. దీనిని చూసిన మంత్రి విజయ్ తమిళన్ పార్తీపన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే జాతీయ జెండాను కిందికి దించారు. ఆ తర్వాత మంత్రి స్వయంగా జాతీయ జెండాను సరిగ్గా కట్టి, మళ్లీ ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఇలాంటి తీవ్ర అజాగ్రత్తకు పాల్పడిన వారిపై జిల్లా ప్రధాన విద్యాశాఖ అధికారి ఎల్లప్పన్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో మేట్టుపట్టి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు జాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది. దీని ఆధారంగా జిల్లా ప్రధాన విద్యాశాఖ అధికారి ఎల్లప్పన్, సదరు వ్యాయామ ఉపాధ్యాయుడు జాన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


