సాక్షి, చైన్నె : రొమ్ము క్యాన్సర్‌పై ముందస్తు గుర్తింపు, అవగాహన ప్రాముఖ్యతను చాటే దిశగా చైన్నెలోని రేలా ఆసుపత్రి ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ రేలా ఇని స్టిట్యూట్ – మెడికల్ సెంటర్ చైర్మన్ ప్రొఫెసర్ మహమ్మద్ రేలా ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలపై అవగాహన కల్పించేందుకు రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసం పాటిస్తున్నారన్న విషయాన్ని చాటే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ మహమ్మద్ రెలా మాట్లాడుతూ.. వ్యాధిని ముందుగానే గుర్తించడం ద్వారా చికిత్స ఫలితాలను మెరుగుపరచుకోవచ్చు అని వివరించారు. మహిళలు తమ శరీరంపై శ్రద్ధ వహించి, ఏవైనా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్యాన్సర్‌పై ఉన్న భయాన్ని, అపోహలను తొలగించడమే ఈ మాసం ముఖ్య ఉద్దేశ్యం అని పేర్కొన్నారు. రొమ్ము శస్త్రచికిత్స కన్సల్టెంట్ డాక్టర్ స్వాతి ప్రకాష్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ కేసులలో భారత్ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, తగిన సమయంలో చికిత్స తీసుకోకపోవడం వల్ల మరణాల విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో తో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం మరింతగా ఉందని సూచించారు. క్రమం తప్పని స్క్రీనింగ్, సకాలంలో వైద్య సంరక్షణ తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు ఈ వేదికగా పిలుపునిచ్చారు.


