తమిళసినిమా: ప్రపంచంలో 80 శాతం అవినీతి కార్యకలాపాలు జరిగేది హార్బర్లలోనే. రకరకాల అక్రమాలకు కేరాఫ్ ఇదే. అదేవిధంగా పలు దేశాలకు మాదక ద్రవ్యాలు వంటి చట్ట విరోధ కార్యకలాపాలకు భారత దేశం అడ్డాగా మారింది.ఇలాంటి మాదకద్రవ్యాల విక్రయాలకు విదేశీ స్మగ్లింగ్ ముఠా కన్ను పడుతోంది ఇండియా పైనే. ఇలాంటి అక్రమాలను అరికట్టడం కస్టమ్ శాఖాధికారులకు ఛాలెంజ్ గా మారింది. ఇలాంటి కథాంశంతో ఎస్ ఆర్.డ్రీమ్ స్టూడియో సంస్థ రూపొందిన తాజా చిత్రం ఎనిమీ ఆఫ్ స్మగ్లర్. విశేషం ఏమిటంటే నిజం కస్టమ్ శాఖాధికారి టీ.సమయ మురళి ఈ చిత్రానికి కథ, దర్శకత్వం, నేపథ్య సంగీతం అందించి ప్రధాన పాత్రను పోషించడం. టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ.చక్రవర్తి , మలయాళ ప్రముఖ నటుడు లాల్, నటి రాధిక శరత్ కుమార్, చరణ్ శక్తి, బాలా శరవణన్, నటి స్మేహ, కాళీ వెంకట్, జాఫర్ సాదిక్, మైమ్ గోపి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కే.విన్ భాస్కర్ ఛాయాగ్రహణం, శ్యామ్ డేనియల్ సంగీతాన్ని అందించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రంలో ప్రేమ, స్నేహం, సెంటిమెంట్ వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ఇది తన అనుభవంలో జరిగిన ఘటనలకు కొంచెం కల్పిత సన్నివేశాలను జోడించి చక్కని సందేశంతో పాటూ జనరంజకంగా తెరకెక్కించినట్లు దర్శకుడు పేర్కొన్నారు. కాగా ఎనిమీ ఆఫ్ స్మగ్లర్ చిత్రం ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


