జైళ్ల శాఖ డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

జైళ్ల శాఖ డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ బదిలీ

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● కొత్త డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ శంకర్‌ నియామకం ● పట్టుబడ్డ 17 మంది ఖైదీలు

సాక్షి చైన్నె: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న జైళ్ల నుంచి ఖైదీల పరారీ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జైళ్ల శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) సందీప్‌ రాయ్‌ రాథోర్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త జైళ్ల శాఖ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి శంకర్‌ను నియమించింది. బదిలీ అయిన సందీప్‌ రాయ్‌ రాథోర్‌ను విద్యుత్‌ బోర్డు అవినీతి నిరోధక విభాగం అధికారిగా పంపించారు. వివరాలు.. తేని జిల్లా తేక్కంపట్టి జైలు నుంచి ఈనెల 26న రాత్రి 17 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేసి ఒకేసారి పారిపోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు 36 గంటల పాటు శ్రమించి 17 మందిని మళ్లీ పట్టుకున్నప్పటికీ, జైళ్లలో నెలకొన్న తీవ్ర భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రతి పక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అలాగే కొద్ది రోజుల క్రితం చైన్నెలోని పుళల్‌ కేంద్ర కారాగారం నుంచి కూడా ఇద్దరు ఖైదీలు తప్పించుకున్న ఘటన ప్రతి పక్షాలకు మరో అస్త్రంగా మారింది. ఖైదీలు పట్టుబడినా, జైళ్లలో భద్రతల కొరవడిందన్న విమర్శలకు ప్రభుత్వ సమాధానాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో శాఖ శాంతిభద్రతల సమర్థవంతమైన నిర్వహణ కోసం డీజీపీ స్థాయి అధికారిని బదిలీ చేస్తూ చర్యలు చేపట్టింది.

బెయిల్‌ రాక పోవడంతోనే..

తేని జిల్లా తేక్కంపట్టి జైలు నుండి పోలీసులపై దాడి చేసి పరారైన 17 మంది ఖైదీలను పోలీసులు కేవలం 36 గంటల వ్యవధిలోనే శ్రమించి తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల విస్తృత విచారణ సాగుతుండగా, ఖైదీలను ఇతర జైళ్లకు భద్రత నడుమ తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా ముగ్గురిని తిరునల్వేలి పాళయం కోట్టై కేంద్ర కారాగారినికి తరలించారు. దక్షిణ జోన్‌ ఐజీ విజయేంద్ర బిధారి మాట్లాడుతూ.. బెయిల్‌ రాకపోవడంతో నిరాశ చెందిన ఖైదీలు, దివ్యాంగుడైన లింగ ప్రసాద్‌ ప్లాన్‌ ప్రకారం ఈ పరారీకి యత్నించినట్టు తేలిందన్నారు. ఇకపై జైలు మౌలిక సదుపాయాలు, భద్రతా వ్యవస్థలలో సమూల మార్పులు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement