సాక్షి, చైన్నె: ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు (అక్రిడిటేషన్) మంజూరు చేసే ప్రక్రియలో రూ. 100 కోట్ల లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని నవంబర్ 10వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. ఈ పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెంచ్ లో గురువారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల తరఫున చీఫ్ క్రిమినల్ అడ్వకేట్ జాన్ సత్యన్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ అన్బిల్ మహేష్‌ను ఇప్పటికే అరెస్టు చేశామని, ఆయనను పోలీసు కస్టడీకి ఇచ్చి విచారించేందుకు అనుమతించాలని కోరుతూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని వివరించారు. అలాగే ఈ కేసులో పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ముత్తుకుమార్ ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోయారని ధర్మాసనానికి తెలియజేశారు. అన్బిల్ మహేష్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది పి. విల్సన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన తర్వాత, తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆలోచిస్తున్న సమయంలో 40 మందికి పైగా పోలీసు అధికారులు న్యాయవాది కార్యాలయంలోకి చొరబడి అన్బిల్ మహేష్‌ను అరెస్టు చేశారని వివరించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందా? ,పోలీసులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఆరోపణలను పోలీసు యంత్రాంగం తోసిపుచ్చింది. న్యాయవాది కార్యాలయం వెలుపల దాదాపు గంటన్నర పాటు వేచి చూసిన అనంతరమే అన్బిల్ మహేష్‌ను అరెస్టు చేయడం జరిగిందని వివరించారు. ఆ కార్యాలయం లోపల అరెస్టు చేశారన్న ఆరోపణలను ప్రత్యేక కోర్టు ఇప్పటికే తిరస్కరించిందని సీసీబీ తరఫు న్యాయవాది వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి లక్ష్మీనారాయణన్, ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ అన్బిల్ మహేష్ దాఖలు చేసిన పిటిషనన్‌పై తదుపరి విచారణను నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పుళల్ జైలులో రిమాండ్‌లో ఉన్న అన్బిల్ మహేశ్‌ను డీఎంకే యువజన నేత, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయ నిధి స్టాలిన్ పరామర్శించారు.


