సాక్షి, చైన్నె: ప్రపంచ స్ట్రోక్ (పక్షవాతం) దినోత్సవాన్ని పురస్కరించుకుని, సకాలంలో వైద్య సహాయం అందాల్సిన ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చైన్నెలోని ఎంజీఎం హెల్త్‌కేర్ స్టైడ్ ఫర్ స్ట్రోక్ వినూత్నంగా గొడుగు వాకథాన్ నిర్వహించారు. ఆసుపత్రి ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ 3 కిలోమీటర్ల అంబ్రెల్లా వాకథాన్‌లో పక్షవాతం నుండి కోలుకున్నవారు, వ్యాధి బారిన పడకుండా నివారించబడినవారితో సహా 400 మందికి పైగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ నటి రమ్య సుబ్రమణియన్, ఎంజీఎం హెల్త్‌కేర్ న్యూరోసర్జరీ డైరెక్టర్ డాక్టర్ రూపేష్ కుమార్, క్లినికల్ లీడ్ – సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వాసుదేవన్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీవర్ధన్, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ క్లినికల్ లీడ్ డాక్టర్ ఆర్తి దీపేష్‌ల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రూపేష్ కుమార్ మాట్లాడుతూ.. స్ట్రోక్ అనేది కాలంతో చేసే పందెం. శరీరంలో ఒకవైపు అకస్మాత్తుగా నీరసం, తిమ్మిరి, ముఖం వాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని పిలుపు నిచ్చారు. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు తగిన జీవనశైలి మార్పులు చేసుకోవాలని సూచించారు. సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి పద్మనాబన్ మాట్లాడుతూ.. స్ట్రోక్ విషయంలో ప్రతి సెకను విలువైనది. లక్షణాలను ముందుగానే గుర్తించి, వైద్య సహాయం పొందడంలో ఆలస్యం చేయకపోతే ప్రాణాలను కాపాడుకోవచ్చు అని పేర్కొన్నారు.


