సాక్షి, చైన్నె: ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ నర్సింగ్ 35వ బ్యాచ్ బీఎస్సీ నర్సింగ్, 34వ బ్యాచ్ డీజీఎన్‌ఎం విద్యార్థుల కోసం దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి, నర్సింగ్ వృత్తికి విద్యార్థులు తమను తాము అంకితం చేసుకునే క్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు సాంఘిక సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు, కె. పోర్కోడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ విద్యా సంస్థ అదనపు రిజిస్ట్రార్ డాక్టర్ టి. మైథిలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కళాశాల డీన్ ప్రొఫెసర్ జె.సి. హెలెన్ షాజీ తో సాటేగా నర్సింగ్ అధ్యాపకులు విద్యార్థుల చేతుల్లోని దీపాలను వెలిగించారు. చీఫ్ నర్సింగ్ ఆఫీసర్ కవిత విద్యార్థులచే ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎస్.ఆర్.ఎం. మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కె. పోర్కోడి మాట్లాడుతూ, నర్సింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది, బాధ్యతలతో కూడిన వృత్తిగా వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతత, సానుభూతి ప్రదర్శిస్తూ రోగులకు కొండంత ఆశను, ధైర్యాన్ని అందించే గొప్ప శక్తి నర్సులకు మాత్రమే ఉంటుందన్నారు.


