తిరువొత్తియూరు: సాత్తాంకుళం సమీపంలోని ముదూలూరుకు చెందిన ముత్తుకృష్ణన్ రోజువారీ కూలీ. ఆయన భార్య మేరీ రెజిల్లా. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, బ్లెస్సెడ్ రాజా అనే ఒక కుమారుడు ఉన్నారు. ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున వీరి ఇంట్లోకి చొరబడిన ఒక గుర్తుతెలియని వ్యక్తి, మేరీ రెజిల్లాపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అంతేకాకుండా ముత్తుకష్ణన్, బ్లెస్సెడ్ రాజాలపై కూడా దాడి చేసి, ఇంట్లోనే ఉన్న ఇద్దరు బాలికలను బెదిరించి కిడ్నాప్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా, ఆనందపురం ప్రాంతానికి చెందిన జ్ఞానప్రకాష్ అనే యువకుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు తేలింది. జ్ఞానప్రకాష్ ఆ బాలికలను తన ఇంట్లో బంధించినట్లు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి వారిని సురక్షితంగా రక్షించారు. అనంతరం అడవి ప్రాంతంలో దాక్కున్న జ్ఞానప్రకాష్‌ను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, నిందితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ముతుకృష్ణన్, బ్లెస్సెడ్ రాజాలను నైల్లె (తిరునల్వేలి) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తీవ్ర నిఘాలో చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ముత్తుకృష్ణన్ గురువారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొదట నమోదైన మేరీ రెజిల్లా హత్య కేసును, ఇప్పుడు జంట హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా పేరంబంబాక్కం నందా నగర్‌కు ప్రాంతానికి చెందిన ధర్మేంద్రన్ మప్పేడులోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతను తన ఇంటికి సీసీటీవీ కెమరాలను అమర్చి వాటి లైవ్‌ను సెల్‌ఫోన్‌లో చూసుకునే విధంగా సదుపాయాన్ని చూసుకునేలా ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో యధావిధిగా ధర్మేంద్రన్ మధ్యాహ్నం రెండు రెండుగంటలకు తన కార్యాలయానికి వెళ్లగా, అదును చూసి ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి బీరువాలో వుంచిన బంగారు నగలను చోరీ చేశారు. ఈ వీడియో సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. విషయాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తి పేరంబాక్కం గ్రామానికి చెందిన వేలు కుమారుడు దీపన్‌గా గుర్తించారు. అనంతరం అతడ్ని రెండుగంటల్లో పట్టుకున్న పోలీసులు అతడి నుంచి బంగారు నగలను రికవరీ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
తిరువళ్లూరు: అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడంలో యువత, విద్యార్థులు కీలక పాత్రను పోషించాలని డీఎస్పీ జయకుమార్ అన్నారు. ఏటా అక్టోబర్ నెల చివరి వారంలో అవినీతికి వ్యతిరేక వారోత్సవాలను నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ సంవత్సరం అక్బోటర్ 26 నుంచి నవంబర్ నాలుగు వరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపద్యంలో అవినీతి రహిత సమాజ నిర్మాణంపై విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీని డీఎస్పీ జయకుమార్, విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ తమిళరసి, మాల తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ససీ నాయుడు రోడ్డు, నేతాజీ రోడ్డు మీదుగా సాగింది. ర్యాలీలో అవినీతిని నిరోదించాలి. లంచగొండి తనాన్ని పోత్సహించకూడదంటూ విద్యార్థులు నినా దాలు చేశారు. కార్యక్రమంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ గుణశేఖరన్, కుమరేషన్, ఉపాధ్యాయుడు మురళీ, బాలచ్రందన్ పాల్గొన్నారు.
తిరువళ్లూరు: రోడ్డు నిర్మాణం పేరిట రాత్రి సమయంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అరణ్‌వాయల్ ప్రాంతానికి చెందిన స్థానికులు వాహనాలను అడ్డుకుని రాస్తారోకోకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తిరువళ్లూరు జిల్లా వెంగత్తూరు గ్రామానికి చెందిన చెరువు వుంది. ఈ చెరువు ద్వారా అరణ్‌వాయల్, వెంగత్తూరుతో పాటు పలు ప్రాంతాలకు చెందిన భూములకు సాగునీరు అందిస్తున్నారు. కాగా చెరువుకు సమీపంలో ఎన్నూరు నుంచి మహాబలిపురం వరకు వెళ్లే రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం రాత్రి సమయంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలను చేస్తున్నారని, తద్వారా కరకట్ట తెగిపోయే ప్రమాధం వుందని ఆరోపిస్తూ స్తానికులు గురువారం ఉదయం వాహనాలను అడ్డుకుని రాస్తారోకో నిర్వహించారు. రాత్రి సమయంలో జరిగే మట్టి తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. కపోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆందోళన చేస్తున్న వారి వద్దకు వెళ్లి వారిని సముదాయించి ఆందోళనను విరమింపజేశారు.


