మేయర్ ఆగ్రహం
సాక్షి చైన్నె: గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో గురువారం తీవ్ర కలకలం చోటు చేసుకుంది. ప్రభుత్వ, కార్పొరేషన్ అధికారిక కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందకపోవడం, అధికారుల అలసత్వంపై మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్, డీఎంకే కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ ప్రియ ఆవేశంగా మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులకు గౌరవం లేనప్పుడు, ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే కార్పొరేషన్‌ను రద్దు చేయాలని వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది. కాగా కార్పొరేషన్ అధికారులు, కమిషనర్ తీరుపై డీఎంకే కౌన్సిలర్లు సమావేవంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కొత్త భవనాల ప్రారంభోత్సవాలు లేదా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా స్థానిక కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వడం లేదని, శిలాఫలకాలపై తమ పేర్లు సరిగ్గా వేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మేయర్ ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఆహ్వానాలు అందడం లేదన్నారు. రిప్పన్ బిల్డింగ్‌కు సీఎం వచ్చిన సమయంలో కూడా మేయర్‌గా ఉన్న తనకే ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని మండి పడ్డారు. ప్రజాప్రతినిధులను ఆహ్వానించకూడదని ప్రభుత్వం నుండి ఏవైనా ప్రత్యేక ఆదేశాలు వచ్చాయా? అని ప్రశ్నించారు.
కమిషనర్ వివరణ..
దీనిపై కమిషనర్ సమీరన్ స్పందిస్తూ, ఇకపై ప్రతి అధికారిక కార్యక్రమానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎవరినీ మినహాయించకుండా అందరినీ ఆహ్వానిస్తామని, దీనిపై త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా తీవ్ర వివాదాల నడుమ సాగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి మొత్తం 39 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అమ్మ క్యాంటీన్ల సిబ్బంది వేతనాలను పెంచారు. చైన్నెలోని 382 అమ్మ క్యాంటీన్లలో పనిచేస్తున్న 2,848 మంది మహిళల రోజువారీ వేతనాన్ని రూ. 325 నుండి రూ. 400 కు పెంచేందుకు ఆమోదం తెలిపారు. దీనివల్ల కార్పొరేషన్ నిధుల నుండి రూ. 7.79 కోట్లు వ్యయం కానుంది. అలాగే, 24,264 మంది పారిశుధ్య కార్మికులకు నేరుగా అందించే ఆహారానికి బదులుగా, ప్రతి వ్యక్తికి రోజుకు రూ. 50 చొప్పున అలవెన్స్ నగదుగా అందించాలని నిర్ణయించారు. ఇక, మైలాపూర్‌లోని లూజ్ చర్చ్ రోడ్డు పేరును ఎం.సి.టి.ఎం. చిదంబరం రోడ్డుగా మారుస్తూ తీర్మానం ఆమోదం తెలిపారు. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు కార్పొరేషన్ పరిధిలోని 95 టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ,స్కేటింగ్ కోర్టుల నిర్వహణను 3 సంవత్సరాల పాటు ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని తీర్మానించారు.


