దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● ఉచిత బస్సు ప్రయాణం

సాక్షి, చైన్నె: దివ్యాంగుల సంక్షేమం, స్వావలంబన దిశగా తమిళనాడు ప్రభుత్వం కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. దివ్యాంగులకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఉచిత వాహనాలు, అధునాతన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయక పరికరాల కొనుగోలుపై సబ్సిడీలను అందిస్తూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి మధుమతి వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు.

100 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణం

ప్రత్యేక గుర్తింపు కార్డు కలిగిన అన్ని వర్గాల దివ్యాంగులు ప్రభుత్వ రవాణా సంస్థలకు చెందిన బస్సులలో 100 కిలోమీటర్ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు అని ప్రకటించారు. ఈ సదుపాయం నగర, పట్టణ లో–ఫ్లోర్‌ బస్సులు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, ఎల్‌ఎస్‌ఎస్‌, టీఎస్‌ఎల్‌ఎక్స్‌, శివారు , కొండ ప్రాంతాల సాధారణ ఛార్జీల బస్సులకు వర్తిస్తుందని ప్రకటించారు. ఒంటరిగా ప్రయాణించలేని దివ్యాంగులకు కొన్ని షరతులతో తోడుగా ఒక వ్యక్తికి కూడా ప్రయాణ అనుమతి ఉంటుందని వివరించారు.

రూ. 4 కోట్లతో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

మొదటి దశలో 400 మంది దివ్యాంగులకు రూ. 4 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా రూపొందించిన కప్లింగ్‌ వీల్స్‌ ఉన్న పెట్రోల్‌ స్కూటర్లు లేదా బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్‌ వాహనాలను అందిస్తారు. 18 ఏళ్లు పైబడిన దివ్యాంగ విద్యార్థులకు, ఆ తర్వాత 18 నుండి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉండి ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారికి దీని ద్వారా ప్రాధాన్యత లభిస్తుంది.

ఏఐ ఆధారిత పరికరాలకు రూ. 3 కోట్ల సబ్సిడీ

ప్రస్తుత సాంప్రదాయ పథకాల పరిధిలోకి రాని అత్యాధునిక ఏఐ ఆధారిత సహాయక పరికరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 50% రాయితీ లేదా గరిష్టంగా రూ. 30,000 వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. 2026–27 సంవత్సరానికి గాను 1,000 మంది లబ్ధిదారుల కోసం రూ. 3 కోట్లు కేటాయించారు. క్రీడా పోటీల కోసం ఉపయోగించే కృత్రిమ కాళ్లు, కండరాల కదలికలతో పనిచేసే మైయోఎలెక్ట్రిక్‌ కృత్రిమ చేతులు, కాక్లియర్‌ ఇంప్లాంట్‌ బ్యాటరీలు వంటి ఆధునిక పరికరాలు ఈ పథకం కిందకి వస్తాయి. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement