వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయ కార్తీక మహా దీపోత్సవ ఆహ్యాన పత్రికను శివాచార్యుల వేద మంత్రాల నడుమ ఆలయ జాయింట్ కమిషనర్ భరణీధరన్ విడుదల చేశారు. అరుణాచలేశ్వరాలయ కార్తీక మహా దీపోత్సవం ఏటా ధ్వజా రోహణంతో ప్రారంభమై పది రోజుల పాటు జరగడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం కార్తీక మహా దీపోత్సవాలు నవంబర్ 12వ తేదీన దుర్గమ్మ ఉత్సవంతో ప్రారంభమై 14వ తేదీన ఉదయం 6 గంటలకు ధ్వజా రోహణం, 24 తేదీన ఉదయం 4 గంటలకు ఆలయంలో భరణి దీపం, సాయంత్రం ఆలయం వెనుక వైపునున్న మహా కొండలో 2,668 అడుగుల ఎత్తులో మహా దీపాన్ని వెలిగించనున్నారు. ఈ దీపాన్ని దర్శించుకునేందుకు దేశ నలు మూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆలయంలో ఆహ్యాన పత్రికకు ఆలయ జేసీ భరణీధరన్ ఆధ్వర్యంలో శివాచార్యులు ఆలయంలోని సప్త వినాయకుడి సన్నిధిలో వేద మంత్రాల మధ్య పూజలు చేశారు. ఈ మహా దీపోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండే విధంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పోస్టర్‌ను అవిష్కరించి శివాచార్యులు అరుణాచలేశ్వరునికి హరోంహరా అంటూ నామస్మరణతో ప్రత్యేక పూజలు చేశారు.


