● రాత్రంతా భారీగా ఎగసిపడ్డ కెరటాలు ● ఎన్నూర్‌ నుంచి మహాబలిపురం వరకు నిఘా ● కొడైకెనాల్‌, ఊటీ వెలవెల | - | Sakshi
Sakshi News home page

● రాత్రంతా భారీగా ఎగసిపడ్డ కెరటాలు ● ఎన్నూర్‌ నుంచి మహాబలిపురం వరకు నిఘా ● కొడైకెనాల్‌, ఊటీ వెలవెల

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● రాత్రంతా భారీగా ఎగసిపడ్డ కెరటాలు ● ఎన్నూర్‌ నుంచి మహాబలిపురం వరకు నిఘా ● కొడైకెనాల్‌, ఊటీ వెలవెల

తీరంలో ఉత్కంఠ

భార తియార్‌నగర్‌ వద్ద అలల తాకిడి

తీరం వెంబడి భద్రత

సాక్షి, చైన్నె : అర్నబ్‌ తుపాన్‌ తీరం దాటే ప్రక్రియ సమయంలో ఉత్తర, దక్షిణ చైన్నెలోని సముద్ర తీర ప్రాంతాలు తీవ్ర అల్లకల్లోలంగా మారాయి. ఉధృతమైన సముద్రపు అలలు రక్షణ గోడలను దాటుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగానే వర్షాలు పడ్డాయి. అయితే, అర్నబ్‌ తుఫాన్‌ ఏర్పడిన తదుపరి మంగళ, బుధవారాలలో వర్షాలకు కాస్త విరామం అన్నట్టు గా పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి గురు, శుక్ర, శనివారాలలో నెలకొననున్నాయి. ఈ పరిస్థితులలో అర్నబ్‌ తుపాన్‌ తీరం వైపుగా దూసుకెళ్తున్న సమయంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు ఉత్తర , దక్షిణ చైన్నె సముద్ర తీరం అల్లకల్లోలంగా మారినట్టైంది. చైన్నెలోని ఎన్నూర్‌, తిరువొత్తియూర్‌, పళవేర్కాడు, తిరువళ్లూరు జిల్లాల సముద్ర తీరాల్లో అలల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎన్నూర్‌లోని భారతియార్‌ నగర్‌ ప్రాంతంలో బీచ్‌ను దాటుకుని వచ్చిన నీరు రోడ్లను ముంచెత్తింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన అనేక ద్విచక్ర వాహనాలు సముద్రపు అలల తాకిడికి కొట్టుకుపోయాయి.భారతియార్‌ నగర్‌లోని సుమారు 6 వీధుల్లోకి సముద్రపు నీరు వేగంగా ప్రవేశించింది. గతంలో తమిళనాడును వణికించిన సునామీ సమయాన్నే ఈ పరిస్థితులు గుర్తుచేస్తున్నాయని స్థానిక నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది కుటుంబాలు తమ ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ఆందోళన చెందుతున్నాయి.

తీరం వెంబడి భద్రతతో..

పరిస్థితి తీవ్రతను గమనించిన ఉన్నతాధికారులు తక్షణమే అలల తాకిడి ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. సముద్ర తీర ప్రాంతాలకు ఎవరూ వెళ్లవద్దని, రోడ్లపై తిరగవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు. ఎన్నూర్‌ నుంచి మహాబలిపురం వరకు భద్రత పరంగాచర్యలు తీసుకున్నారు. అర్నబ్‌ తీరం దాటే వరకు ఏ ఒక్కర్నీ సముద్ర తీరంలోకి అనుమతించ లేదు. ఇక,తిరువొత్తియూర్‌ ఎమ్మెల్యే సెంథిల్‌కుమార్‌ ఎన్నూర్‌ , పరిసర ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, రెవెన్యూ విభాగాల అధికారులను ఆదేశించారు. అర్నబ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైపుగా దూసుకెళ్లడంతో చైన్నె నుంచి ఆంధ్రా మీదుగా టేకాఫ్‌ తీసుకోవాల్సిన 12 విమానాల సేవలను రద్దు చేశారు.

అండమాన్‌ తీరంలో కొత్త అల్పపీడనం

ప్రస్తుతానికి వరుణుడు విశ్రాంతి తీసుకున్నా, నవంబర్‌ మొదటి వారం నుంచి మళ్లీ రాష్ట్రంలో దంచి కొట్టనున్నారు. ఈ మేరకు దక్షిణ అండమాన్‌ , దానిని ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాలలో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చైన్నె వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రభావం పశ్చిమ కనుమలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణ తమిళనాడులో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో పొడి వాతావరణం నెలకొంటుంది. నవంబర్‌ 1, 2 తేదీలలో ఉత్తర తమిళనాడులో మోస్తరు వర్షాలు, దక్షిణ తమిళనాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, నవంబర్‌ 3 తదుపరి వర్షాలు మరింతగా ఎదురు చూడవచ్చు అనిప్రకటించారు. ఇక, చైన్నె, శివారులలోరానున్న రోజులలో ఆకాశంమేఘావృతమై ఉండటమే కాకుండా గరిష్ట ఉష్ణోగ్రత 34–35 సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 25–26ని సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు. గడిచిన 24 గంటలలో కన్యాకుమారి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. పెరుంజని డ్యామ్‌, సురులకోడ్‌లలో 4 సెం.మీ., చితరారు, పుత్తన్‌ డ్యామ్‌, శివలోకంలలో 3 సెం.మీ,పాలమోర్‌, పెచిప్పరైలలో 2 సెం.మీ. వర్షం పడింది. ఇక, వర్షాల దాటికి తీవ్ర ప్రభావానికి గురైన పర్యాటక ప్రాంతాలు ఊటీ, కొడైకెనాల్‌ వెల వెల బోయాయి. కున్నూరు మార్గంలో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడే పరిస్థితులు ఉండటంతో వాహనదారులను అప్రమత్తమయ్యారు.12కు పైగా ప్రాంతాలలో రోడ్డుపైన కొండ చరియలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, ఊటీ – మేట్టుపాళయం – కున్నూరు మార్గం వెంబడి కొండ చరియలు విరిగి పడే పరిస్థితులు ఉన్న ప్రాంతాలలో అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement