సాక్షి, చైన్నె: రాష్ట్రంలో 13 ఏళ్ల తర్వాత ఆటో చార్జీల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. కనీస చార్జీగా రూ.50 నిర్ణయించారు. వెయిటింగ్ చార్జిగా నిమిషానికి రూ.ఒకటి వసూళ్లు చేయనున్నారు. వివరాలు.. రాష్ట్రంలోని చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై, తిరునల్వేలి తదితర ప్రధాన నగరాల్లో ఆటోలకు మీటర్లను 2013లో తప్పని సరి చేసిన విషయం తెలిసిందే. కొంత కాలంగా ఇది అమల్లో ఉన్నా, ఆతర్వాత గాల్లో కలిసింది. డీఎంకే అధికారంలోకి వచ్చినానంతరం ఆటో చార్జీల మీద దృష్టి పడింది. చార్జీల పెంపునకు అన్ని వర్గాల అభిప్రాయల సేకరణ నిమిత్తం ఓ కమిటిని నియమించింది. ఈ కమిటీ చార్జీల పెంపునకు తగ్గ సిఫారసులతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కార్మిక, ఆటో సంఘాలతో రవాణా,కార్మిక సంక్షేమ కమిషనర్ సమావేశమయ్యారు. కమిటీ సిఫారసు, అన్ని వర్గాల అభిప్రాయాలతో ప్రస్తుతం కొత్త చార్జీలను నిర్ణయించారు. అయితే, దీనికి ఆటో కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. అలాగే, తమ నేతృత్వంలో కొత్త చార్జీలు అంటూ ఓ జాబితాను ప్రకటించాయి. గత ఏడాది తమ చార్జీల వసూళ్లకు కార్మిక సంఘాలు నిర్ణయించినా, పోలీసులు కన్నెర్ర చేయడంతో వెనక్కి తగ్గారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మళ్లీ ఆటో చార్జీల ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఆటో చార్జీలను పె ంచాలని డ్రైవర్లు, యాజమాన్యాలు ఆందోళనలు చేస్తూ వచ్చారు. గత 13 సంవత్సరాలలో పెట్రోల్, సీఎన్‌జీ , ధరలు, వాహన బీమా ప్రీమియంలు, విడిభాగాల ధరలు విపరీతంగా పెరగడంతో పాత ఛార్జీలతో ఆటో నడపడం కష్టంగా మారిందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆటో డ్రైవర్లు, ఆటో యాజమాన్యాలతో సాగిన చర్చలతో కొత్త చార్జీల జాబితాను బుధవారం ప్రకటించారు. ఇందులో మొదటి 1.8 కిలో మీటర్ దూరానికి కనీస చార్జీగా రూ.50 నిర్ణయించారు. ఆతదుపరి కిలో మీటర్‌కు రూ. 25 చొప్పున చార్జీ ప్రకటించారు. వెయిటింగ్ చార్జీగా నిమిషానికి రూ. ఒకటి వసూలు చేయనున్నారు. కాగా, ఒక్క చైన్నెలో లక్షా 4 వేల ఆటోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే ఇతర నగరాలలో లక్షలాది ఆటోలు ఉండటంతో అన్నింటికి మీటర్లను తప్పనిసరి చేశారు. ఉన్న మీటర్లను సరి చేయడం, అవసరం అయితే,కొత్త మీటర్ల ఏర్పాటుకు ఆరు నెలలు గడువు ను కేటాయించారు. కొత్త చార్జీల వివరాలన్నీ ఆయా ఆటోలపై ముద్రించే రీతిలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.


