తేని జైలు ఘటనతో అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

తేని జైలు ఘటనతో అలర్ట్‌

Oct 29 2026 2:18 AM | Updated on Oct 29 2026 2:18 AM

● అన్ని జైళ్లలోని వాచ్‌ టవర్ల నుంచి భద్రతా పర్యవేక్షణ ● తప్పించుకున్న ఖైదీలను కాల్చి పట్టుకోవాలని ఆదేశాలు

సాక్షి, చైన్నె: తేని జిల్లా జైలు నుంచి పారిపోయి ఇంకా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మిగిలిన ఇద్దరు ఖైదీలను అవసరమైతే కాల్చి పట్టుకోవాలని దక్షిణ జోన్‌ ఐజీ విజయేంద్ర బిధారి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని జైళ్లులో భద్రతను కట్టుదిట్టం చేశారు. వాచ్‌ టవర్ల నుంచి సిబ్బంది భద్రతా పర్యవేక్షణకు చర్యలు తీసుకున్నారు. తేని జిల్లా జైలులో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై భౌతిక దాడికి దిగి 17 మంది ఖైదీలు ఒకేసారి పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించి భారీ గాలింపు చర్యలు చేపట్టింది. తొలుత జైలు సమీపంలోనే ప్రవీణ్‌ కుమార్‌ పట్టుబడగా, ఆ తర్వాత సిలంబరసన్‌, రాజా సికందర్‌, రాజ్‌కుమార్‌, దివ్యాంగ ఖైదీ ప్రశాంత్‌ తో సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

డ్రోన్‌ కెమెరాలతో సెర్చ్‌

అటవీ ప్రాంతంలో దాక్కున్న కరుప్పసామి, తరుణ్‌కుమార్‌, పాండిచెల్వం, శబరినాథ్‌ , నిశాంత్‌, ముత్తు ఇలంగోవన్‌, కార్తీక్‌ రాజా, సోలై ముగిలేశ్వరన్‌న్‌ అనే మరో ఎనిమిది మందిని డ్రోన్ల సహాయంతో కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. కొండ ప్రాంతాల్లో నక్కిన పొన్ముత్తు, రెజీనాను కూడా ప్రత్యేక పోలీసు దళాలు అదుపులోకి తీసుకున్నాయి. 17 మందిలో 15 మందిని బుధవారం ఉదయం నాటికి అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో మొదట అరెస్టయిన ఐదుగురిని ఇప్పటికే కోర్టులో హాజరుపరచగా, మిగిలిన వారిని కనవిల్‌ పోలీస్‌ స్టేషనన్‌లో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.

బైక్‌ లాక్కుని పారిపోయిన ఇద్దరు ఖైదీలు

పోలీసులు తమను చుట్టుముడుతున్నారని గ్రహించిన మిగిలిన ఇద్దరు ఖైదీలు తిరుపతి, మీనాక్షి సుందరం (వీరిద్దరూ సోదరులు) కొండ దిగువకు వేరే మార్గం గుండా పరారయ్యారు. మార్గంమధ్యలో ఎదురుగా వచ్చిన ఒక బైకర్‌పై దాడి చేసి, అతడి ద్విచక్ర వాహనాన్ని లాక్కుని వేగంగా తప్పించుకున్నారు. పారిపోయిన సోదరులిద్దరూ ద్విచక్ర వాహనంపై ఉన్నందున తేని జిల్లా సరిహద్దుల్లో వాహన తనిఖీలను అత్యంత కఠినతరం చేశారు. కనవిరకల్‌ పరిసర ప్రాంతాల్లో గాలింపును ముమ్మరం చేశారు. ఐజీ విజయేంద్ర బిధారి ఆదేశాల మేరకు ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి వారి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. అవసరం అయితే, వారిని తుపాకీతో కాల్చి పట్టుకునేందుకు సైతం ఆదేశాలు జారీకావడంతో పోలీసులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. కాగా, జైలు నుంచి తప్పించుకెళ్లి పట్టుబడిన 15 మందిపై తాజాగా 121(1), 296(బి), 115(2), 118(1), 309(4), 109,262, 353 తదితర తొమ్మిది సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. అందర్నీ కోర్టులో హాజరు పరిచి కట్టుదిట్టమైన భద్రత నడుమ పలు జైళ్లలో బంధించారు. జైళ్ల శాఖ డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ ఆదేశాలతో జైళ్ల శాఖ డిఐజీ ఆర్‌ కనకరాజన్‌, మదురై జైలు సూపరింటెండెంట్‌ ఎ. మురుగేశన్‌, ఐజీ ఆర్‌ కృష్ణరాజ్‌, దక్షిణ డీఐజీ విజయేంద్ర బిదారి, ఐజీ అభినవ కుమార్‌, తేని ఎస్పీ పవీణ్‌ గౌతమ్‌ బుధవారం కూడా తేని జైలులలో భద్రతా ఏర్పాట్ల గురించి సమీక్షించారు. అలాగే, రాష్ట్రంలోని అన్ని జైళ్లలో భద్రతా పరిస్థితులపై ఆరా తీసి కట్టుదిట్టం చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement