సాక్షి, చైన్నె: తమిళనాడులో ప్రజలకు సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు ప్రభుత్వం అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనన్స్ సాంకేతికతతో కూడిన వెట్రి తమిళనాడు ఇంటిగ్రేటెడ్ ఇ–సర్వీసెస్ 2.0 ప్లాట్‌ఫామ్‌కు ప్రణాళికలు రూపొందించింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని దాదాపు 1,000 ప్రభుత్వ సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురానున్నారు.
275 నుండి 1,000 సేవలకు విస్తరణ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేదిక ద్వారా కేవలం 275 రకాల సేవలు మాత్రమే అందుతున్నాయి. సవరించిన ఈ–సర్వీసెస్ 2.0 ద్వారా వాటి సంఖ్యను ఏకంగా 1,000కి పెంచనున్నారు. ఏఐ సాంకేతికత సహాయంతో, అర్హులైన లబ్ధిదారులు కొన్ని ప్రభుత్వ సేవల కోసం పదేపదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా వ్యవస్థే స్వయంచాలకంగా ప్రాసెస్ చేసేలా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 38 ప్రభుత్వ శాఖల పరిధిలోని 25,277 కేంద్రాల ద్వారా రోజుకు సగటున 50 వేల నుండి 80 వేల అభ్యర్థనలు ప్రాసెస్ అవుతున్నాయి. కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ –సర్వీస్ 2.0 ప్లాట్‌ఫామ్ రోజుకు ఏకంగా 1.2 మిలియన్ల 12 లక్షలునుండి 13 లక్షలు అభ్యర్థనలను సమర్థవంతంగా నిర్వహించేలా డిజైన్ చేస్తున్నారు.ఒకే సమయంలో కనీసం 50వేల మంది వినియోగదారులు ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు.
సాంకేతిక ప్రత్యేకతలు – ఏఐ అనుసంధానం
తమిళనాడు ఇ–గవర్నెన్స్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ప్లాట్‌ఫామ్‌లో పలు కీలక డిజిటల్ సేవలను అనుసంధానిస్తున్నారు. ఈ–సైన్ , డిజిటల్ లాకర్ , ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేలతో పాటు 18 డిజిటల్ వ్యవస్థలను, 15 రాష్ట్ర–జాతీయ స్థాయి శాఖల వెబ్‌సైట్‌లను ఈ పోర్టల్‌తో జోడిస్తారు. వినియోగదారులు తమిళం , ఆంగ్ల భాషలలో సులువుగా సంభాషించే సదుపాయం ఉంటుంది. ప్రజలు దాఖలు చేసే ఫిర్యాదులను ఏఐ ద్వారా స్వయంచాలకంగా వర్గీకరించి సంబంధిత అధికారులకు పంపడం, ఒకే ఫిర్యాదు పదేపదే నమోదైతే దాన్ని గుర్తించడం వంటి పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తుంది. ఈ అధునాతన సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిష్కారాలను, ప్రతిపాదనలను సమర్పించడానికి నవంబర్ 3 వరకు వివిధ సాంకేతిక కంపెనీలకు గడువు విధించారు.


