క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Oct 28 2026 1:00 AM | Updated on Oct 28 2026 1:00 AM

గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్‌ సెంటర్‌ ప్రారంభం

వేలూరు: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు చేయడానికే శాటిలైట్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు రెప్‌కో మైక్రో పైనాన్స్‌ లిమిడెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి వెంకటాచలం అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు తాలుకా కందపురి గ్రామంలోని రంగస్వామి మొదలియార్‌ వీధిలో శాటిలైట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వేలూరు జిల్లాలోనే అనకట్టు తాలుకాలో అధికంగా అటవీ ప్రాంతాలున్నాయని ఇటువంటి ప్రాంతంలో తమ సెంటర్‌ను ప్రారంభించడం ద్వారా అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా చిన్న చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు అవసరమైన రుణాలను అందజేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

చౌడేశ్వరీ దేవికి విశేష పూజలు

కొరుక్కుపేట:. చైన్నె పాతచాకలి పేట మింట్‌ సుబ్బరాయలు వీధిలో వెలిసియున్న పురాతన శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరీ దేవి ఆలయంలో మంగళవారం తిరువీధి మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. అందులో భాగంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు , స్వర్ణాభరణాలతో విశేష పూజలను శాస్త్రోక్తంగా చేపట్టారు .అలాగే వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించగా , భక్తులు పసుపు నీళ్లను చల్లుకుంటూ ఆనందోత్సాహాలతో అమ్మవారిని శాంతింపజేశారు. భక్తులకు నిర్వాహకులు సజ్జా శ్రీనివాసులు, సజ్జా సత్యనారాయణ , సజ్జా రాంకుమార్‌ ప్రసాదవినియోగం చేశారు.

పర్యావరణ హిత రవాణా దిశగా అడుగులు

సాక్షి, చైన్నె : హరిత రవాణాను మరింత బలోపేతం చేసేందుకు దిగ్గజ ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ , ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్‌ పరస్పరం చేతులు కలిపాయి. దేశవ్యాప్తంగా అమెజాన్‌ రవాణా నెట్‌వర్క్‌లో 3,000 ఎలక్ట్రిక్‌ ట్రక్కులను ప్రవేశపెడుతున్నట్లు రెండు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి. కేంద్ర మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి చేతుల మీదుగా ఎలక్ట్రిక్‌ ట్రక్కుల మొదటి బ్యాచ్‌ను జెండా ఊపి ప్రారంభించినట్టు ప్రకటించారు.ఈ భాగస్వామ్యం కింద టాటా మోటార్స్‌ ఎలక్ట్రిక్‌ ట్రక్కులను సరఫరా చేయగా, అమెజాన్‌ క్యారియర్‌ భాగస్వాములు వాటిని కొనుగోలు చేసి నడుపుతారు.అలాగే చైన్నె కారిడార్‌ విస్తరణ దిశగా తదుపరి దశలో 7 రాష్ట్రాలు , 6 ప్రధాన ఈ–కామర్స్‌ రీజియన్లను అనుసంధానించే 2,800 కిలోమీటర్ల పొడవైన ఎన్‌హెచ్‌ –48 వెంబడి ఎలక్ట్రిక్‌ ట్రక్కుల సేవలను అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు.ఇందుకోసం యాహ్వీ భాగస్వామ్యంతో హైవేల వెంబడి ప్రత్యేక ఛార్జింగ్‌ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

15 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

అన్నానగర్‌: ఆలందూర్‌, వి.ఓ.సి. కి చెందిన విజయ్‌. ఇతని భార్య సంగీత. వీరిద్దరూ గిండిలోని ఒక లెదర్‌ కంపెనీలో పని చేస్తున్నారు. వీరి రెండవ కుమారుడు అజయ్‌ (15), పరంగిమలైలోని ఒక ప్రైవేట్‌ ఐటీఐలో చదువుతున్నాడు. అజయ్‌ కాలేజీకి వెళ్లకుండా 10 రోజులకు పైగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ కారణంగా అతని తల్లిదండ్రులు అతడిని మందలించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో, సోమవారం సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అజయ్‌ హఠాత్తుగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా సేపటి తర్వాత సంగీత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తలుపు లోపలి నుండి తాళం వేసి ఉంది. ఆమె ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా, అజయ్‌ ఉరివేసుకుని శవంగ వేలాడటంతో రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం క్రోంపేట్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మైలాపూర్‌లో రౌడీ హత్య

అన్నానగర్‌: అడయార్‌లో మంగళవారం ఉదయం మైలాపూర్‌ రౌడీ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చైన్నె సమీపం అడయార్‌ ఇందిరానగర్‌ మెయిన్‌ రోడ్డు పై మంగళవారం ఉదయం సుమారు 11 గంటలకు కొందరు వ్యక్తుల ముఠా ఓ యువకుడిని నరికి చంపి పారిపోయారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అడయార్‌ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. నరికి చంపబడిన వ్యక్తి చైన్నెలోని మైలాపూర్‌కు చెందిన రౌడీ మైత్రేయన్‌. ఇతను ఒక గ్యాంగ్‌స్టర్‌ అని తేలింది. అనంతరం, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం రాయపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు పంపారు.ఈ విషయమై కేసు నమోదు చేసి, హత్య ఎవరు, ఎందుకు చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది. హంతకులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement