తమిళసినిమా: దర్శక నిర్మాత ,అనువాద రచయిత అంటూ బహుముఖ ప్రతిభ కలిగిన ఆర్పీ బాల ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీజీ ముత్తయ్యతో కలిసి ఆర్పీ బాల ఫిలిమ్స్,పీజీ ముత్తయ్య ప్రొడక్షనన్స్ సంస్థల్లో నిర్మిస్తున్న చిత్రంలో నవీన్ చంద్ర కథానాయకుడుగా నటిస్తున్నారు. కోలీవుడ్లో లెవెన్ చిత్రంతో మంచి ప్రశంసలు అందుకున్న నటుడు నవీన్ చంద్ర తెలుగు తదితర ఇతర భాషల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. కాగా తాజాగా ఈయన నటిస్తున్న 51వ చిత్రానికి ఆర్పీ బాల దర్శకత్వం వహిస్తున్నారు. నటి హరిప్రియ రోషిని, బాల శరవణన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం చైన్నెలో నిర్వహించిన సన్నివేశాలతో పూర్తి అయినట్లు ఆర్‌పి. బాల మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా పీజీ ముత్తయ్య ఛాయగ్రహణం, శక్తి బాలాజీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర కథనాలు పూర్తిగా వైవిధ్య భరితంగా ఉంటాయన్నారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సన్నివేశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పీజీ ముత్తయ్య, నవీన్‌చంద్ర, ఆర్పీ బాలా తదితరులు


