వేలూరు: ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎటువంటి సరైన సవరణలు జరగలేదని కేవలం ఓటర్ల పేర్లు మాత్రమే తొలగించేందుకే ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్నారని కర్ణాటక శాసన మండలి సభ్యులు, వేలూరు ఇన్‌చార్జీ ఇవాన్ డిసౌజా అన్నారు. వేలూరు అన్నారోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్ణాటకలోని మంగుళూరు సౌత్ నియోజక వర్గంలోనే 18 వేల మంది ఓటర్లు జాబితా నుండి తొలగించారని ఆయన తెలిపారు. తొలగించిన వారిలో అధికంగా మైనారిటి వర్గాలకు, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబిసీ వర్గాలకు చెందిన వారే అన్నారు. వీటికి నిరసనగా నవంబర్ ఒకటివ తేదీన న్యూ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా స్థాయి, పట్టణ స్థాయి నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో కలుసుకొని జయప్రదం చేయాలని కోరారు. భారత ఎన్నికల కమిషనర్, వీటికి బాద్యులైన ఇతర అధికారులు కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షులు వాహీద్‌బాషా, కేంద్ర జిల్లా అధ్యక్షులు సురేష్‌కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ క్రిష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కోశాఽధికారి సీకే దేవేంద్రన్, ఉపాధ్యక్షులు పీపీ చంద్రప్రకాష్, మాజీ కౌన్సిలర్ పీపీ జయప్రకాష్, పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


