తిరువళ్లూరు: ఉపాధి హమీ పనులను సక్రమంగా కేటాయించాలని కోరుతూ తిరుపందియూరు గ్రామానికి చెందిన మహిళలు కడంబత్తూరు బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌లోని గ్రామాల్లో గ్రామానికి 150 మంది చొప్పున మొత్తం 6,500 మంది మహిళలు జాతీయ ఉపాధి హమీ పథకంలో కూలీలుగా వున్నారు. వీరికి సంవత్సరానికి 125 రోజులు పని దినాన్ని కల్పించాల్సి వుంది. కూలీలను పనికి తగిన వేతనం కింద కూలీలను సరాసరిన రోజుకు 150 నుంచి 180 రూపాయలను ఇస్తున్నారు. కాగా మహిళలకు సంవత్సరానికి 125 రోజులు పని కల్పించాల్సి వున్న క్రమంగా కనీసం 50 రోజులు కూడా పనులు కల్పించడం లేదని ఆరోపిస్తూ మహిళలు ఇటీవలే కలెక్టర్‌తో సహా పలువురు ఉన్నత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అయితే ఇంత వరకు సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో తిరుపందియూరు గ్రామానికి చెందిన మహిళలు కడంబత్తూరు బీడీఓ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.


