శశికుమార్ హీరోగా నూతన చిత్రం
తమిళసినిమా: కథా పాత్రలకు ప్రాముఖ్యతనిస్తూ వెర్సటైల్ నటుడిగా పేరు తెచ్చుకున్న శశికుమార్ ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా మరో నూతన చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈయన నటిస్తున్న చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్ సంస్థ అధినేత ఆర్ .రవీంద్రన్ 6 డైమండ్స్ ఫిలిమ్స్ అండ్ మీడియా ఎల్ ఎల్ పీ సంస్థ అధినేతలు సుల్తాన్ జసాని, చేతన్ డియోలేకర్ లతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ప్రముఖ కన్నడ దర్శకుడు, గీత రచయిత హరి సంతోష్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం షూటింగ్ ఇటీవల చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. నటి శ్వాసిక నరేన్, అంజిలి నాయర్, నందితా శ్వేత , హరి శంకర్, హరీష్ పేరడీ, పీఎల్. తేనప్పన్, వైయాపురి, అనంతనాగ్, వసంతి గురు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సరికొత్త కుటుంబ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. థ్రిల్లర్ జోనర్‌కు ఇతర అంచనాలను జోడించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే కథా చిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. తాను తొలి తమిళ చిత్రాన్ని ట్రైడెంట్ ఆర్ట్స్, 6 డైమండ్స్ ఫిలిమ్స్ అండ్ మీడియా ఎల్ ఎల్ పీ సంస్థలతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. కాగా చిత్ర షూటింగ్ ను చైన్నెతో పలు ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి క్రిష్ జే.నాగ్ లేచా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని, అరవింద్ సింగ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.


