సాక్షి, చైన్నె: ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసరాలు అందించేందుకు అముదం షాపులు నడుపుతుంటే.. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాత్రం ఒక డిటెక్టివ్ తరహాలో వ్యవహరిస్తూ అనవసర రాజకీయాలు చేస్తున్నారని తమిళ అభివృద్ధి, సమాచార, ప్రచార శాఖ మంత్రి రాజ్‌మోహన్ విమర్శించారు పెరంబలూరులో రూ. 12.83 కోట్ల వ్యయంతో నిర్మించిన 11 కొత్త ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ధరల పెంపునకు కారణాలు..
గల్ఫ్ దేశాల్లో ఇంధన కొరత, మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల వల్లే మార్కెట్‌లో నిత్యావసరాల ధరలు పెరిగాయని మంత్రి వివరించారు. ప్రజలపై భారం పడకుండా అముదం స్టోర్లలో 6 రకాల కిరాణా సరుకులను చౌకగా అందిస్తున్నామని, కేజీ బియ్యాన్ని రూ. 30, రూ. 60 లకే విక్రయిస్తున్నామని తెలిపారు. ప్రజల రద్దీ వల్ల ఏర్పడిన సరుకుల కొరతను అధిగమించేందుకు, రాబోయే 15 రోజులకు సరిపడా నిల్వలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. చైన్నెకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనేది తప్పుడు ప్రచారమని, ప్రతి జిల్లాకు ప్రత్యేక నోడల్ అధికారులను, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. వర్ష నష్టంపై ప్రతిపక్షాలు రాజకీయాలు మానాలని హితవు పలికారు. ప్రైవేట్ పాఠశాలలు వారాంతాల్లో (వీకెండ్స్‌లో) ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో కుల వివక్ష కనిపిస్తే పోలీసులు నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు భోజన విరామం తర్వాత క్రీడలు, లైబ్రరీ, కళల శిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని, ఖాళీగా ఉన్న హెచ్‌ఎం పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. కాగా పెరంబలూరులో లభించిన పురాతన డైనోసార్ గుడ్లు, అమోనైట్ శిలాజాలను భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని, పనిచేయని పాత మ్యూజియంలను కూడా పునరుద్ధరిస్తామని ప్రకటించారు.


