సాక్షి, చైన్నె: చైన్నె కార్పొరేషన్ ప్రధాన కార్యాలయమైన రిబ్బన్ బిల్డింగ్‌లో సోమవారం నిర్వహించిన రాజకీయ పార్టీల సంప్రదింపుల సమావేశం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అనేక పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి..చైన్నె పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ ఆమోదం కోసం ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఎన్నికల అధికారి, కమిషనర్ జి.ఎస్. సమీరన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. సమావేశంలో టీవీకే ప్రతినిధి వి.ఎన్. సబిపుల్ల, డీఎంకే న్యాయ విభాగ కార్యదర్శి కె. చంద్రు, దేవేంద్రన్.అన్నాడీఎంకే తరఫున జిల్లా కార్యదర్శి రవి, సంతానకృష్ణన్.కాంగ్రెస్ న్యాయవాదుల విభాగం ఎస్.కె. నవాజ్.బీజేపీ ప్రతినిధులు వి.పి. దురైసామి, విజయశాంతి. సీపీఐఎం, సీపీఐ, ఏఏపీ, బీఎస్పీ తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. పోలింగ్ కేంద్రాలు 3 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండటం, గత ఎన్నికల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో ఎదురైన సమస్యలను పరిష్కరించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, కేంద్ర ఎన్నికల సంఘం వైఖరి సరిగ్గా లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ న్యాయవాది ఎస్.కె. నవాజ్ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. అనంతరం డీఎంకే, టీవీకే, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీల ప్రతినిధులు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేస్తున్నట్టుగా బయటకు వచ్చేశారు.మొత్తం ప్రక్రియలో అన్నాడీఎంకే, బీజేపీ ప్రతినిధులు మాత్రమే సమావేశంలో కొనసాగారు. కార్పొరేషన్ కమిషనర్ జి.ఎస్. సమీరన్ మాట్లాడుతూ, పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ పనులను పూర్తి పారదర్శకతతో చేపడుతున్నామన్నారు.


