సాక్షి, చైన్నె: కావేరీ సాంకేతిక కమిటీ ప్రాముఖ్యతను గుర్తించకుండా మైనారిటీ టీవీకే ప్రభుత్వం నిరక్షరాస్యతతో ప్రవర్తిస్తోందని, సీఎం విజయ్ తన వినోద, విలాస కార్యక్రమాలను పక్కనబెట్టి తక్షణమే కావేరీ జలాల సమస్యపై దృష్టి సారించాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి హితవు పలికారు.ఈ విషయమై పళనిస్వామి జారీ చేసిన ప్రకటనలో, కావేరీ నది, దాని జలాలు తమిళనాడు రైతులు , ప్రజల జీవనాధారమని, తమిళనాడు ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. కావేరీ సాంకేతిక కమిటీ ఉపాధ్యక్షుడు సెల్వరాజ్ గత జూన్‌లోనే రాజీనామా చేసినప్పటికీ, నాలుగు నెలల ఆలస్యం తర్వాత ఈ నెల 9న ఆ రాజీనామాను ఆమోదించారని పళనిస్వామి విమర్శించారు. గత నాలుగు నెలలుగా సాంకేతిక కమిటీని ఖాళీగా ఉంచడం వల్ల కర్ణాటక ప్రభుత్వం మేఘదాతు ఆనకట్ట నిర్మాణానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా ప్రభుత్వం నిరోధించలేకపోయిందని ధ్వజమెత్తారు.
రైతులకు సాగుకు తీవ్ర నష్టం
కావేరీ నిర్వహణ అథారిటీ ఆదేశాల ప్రకారం తమిళనాడుకు రావాల్సిన పూర్తి నీటి వాటాను పొందడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కురుమై సాగుకు సకాలంలో నీరు అందించకపోవడం వల్ల రైతులు దారుణంగా నష్టపోయారన్నారు. సంబా సాగుకు జనవరి వరకు పూర్తి నీటి విడుదల అవసరం కాగా, ప్రస్తుతం మెట్టూరు డ్యామ్‌లో కేవలం 54 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉందన్నారు. కావేరీ సమస్యపై తమిళనాడు రైతులు, తాగునీటి కోసం ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతుంటే.. సీఎం విజయ్ మాత్రం బాధ్యతలను విస్మరించి సరదా, వినోద కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. ఆయన తీరు హాస్య నటుడు వడివేలు నటించిన 23వ పులికేసి సినిమా రాజాని గుర్తుచేస్తోంది అని ఎడప్పాడి ఎద్దేవా చేశారు. కావేరీ హక్కులను సాధించడంలోనూ, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మేఘదాతుపై నిరంకుశంగా మాట్లాడుతున్నా దాన్ని ఎదుర్కోవడంలోనూ మైనారిటీ సీఎం విజయ్ సంపూర్ణంగా విఫలమయ్యారని ఆరోపించారు.


