సాక్షి, చైన్నె: దక్షిణ రైల్వే ఉద్యోగులు, రైలు వినియోగదారులు, సాధారణ ప్రజలలో నిజాయితీ, పారదర్శకతను పెంచే లక్ష్యంతో సోమవారం నుంచి నవంబర్ ఒకటో తేది వరకు వారం రోజుల పాటుగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు 2026 నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం రైల్వే జీఎం యు సుబ్బారావు నేతృత్వంలో ప్రారంభించారు. ఈ ఏడాది ఈ వారోత్సవాలను ‘అభివృద్ధికి నిజాయితీ’ అనే ప్రత్యేక ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. చైన్నెలోని దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయంలో ఉదయం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్‌ఎల్‌సీ, కోల్ ఇండియా లిమిటెడ్ మాజీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, దక్షిణ రైల్వే రిటైర్డ్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ టి.వెంకటసుబ్రహ్మణ్యన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ యు. సుబ్బా రావు, అదనపు జనరల్ మేనేజర్ శ్రీ విపిన్ కుమార్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ – సీవీఓ వి.ఆర్. లెనిన్, ప్రధాన విభాగాధిపతులు, 6 డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేర్లు , చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు అధికారులచే నిజాయితీ ప్రతిజ్ఞ చేయించారు. విజిలెన్స్ అనేది కేవలం క్రమశిక్షణా చర్యల కోసం కాదని, అవినీతి రహిత బలమైన వ్యవస్థను నిర్మించడమే దాని ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిర్ణయంలో పారదర్శకత, ప్రతిచర్యలో నిజాయితీ, తద్వారా దేశానికి సమృద్ది అనే సూత్రాన్ని ప్రతి ఉద్యోగి పాటించాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథి టి. వెంకటసుబ్రహ్మణ్యన్ మాట్లాడుతూ, సంస్థాగత పారదర్శకత, పనితీరు మెరుగుపరచడంలో ఈ–ఆఫీస్. ఇ–హైజీన్ కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.


