తిరువళ్లూరు: ప్రజలు వ్యాపారులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడే హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పది మందికి పైగా హిజ్రాలు శనివారం ఉదయం తాలుకా పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు హౌసింగ్ బోర్డు పరిదిలో గతవారం జిమ్‌ను ప్రైవేటు వ్యక్తులు ప్రారంబించారు. అక్కడికి వెళ్లిన స్థానికంగా నివాసం వుంటున్న హిజ్రాలు జిమ్ నిర్వాహకులను బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు. దాదాపు పది వేల రూపాయలను జిమ్ నిర్వాహకుడి నుంచి లాక్కుకున్నారు. ఈ సంఘటనపై సీసీ కెమెరాల్లో నమోదైన వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో బాధితుడు తాలుకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన హిజ్రాలు పది మందిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడుతున్న కొందరు హిజ్రాల వల్ల తమకు జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని, తమను కూడా అలాగే భావిస్తున్నారని ఆరోపించిన మరో హిజ్రాల బృందం తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న హిజ్రాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.


