సాక్షి,చైన్నె: సుమంగళ స్టీల్ ఆధ్వర్యంలో నిర్మాణ రంగ కార్మికులు, స్టీల్ డీలర్‌షిప్ ఉద్యోగుల పిల్లల కోసం నాల్గవ విడత ‘ఉంగళ్ కుళందైయుమ్ ఆగలామ్ ఇంజనీర్’ స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి, కస్తూరి అండ్ సన్స్ డైరెక్టర్ ఎన్. రవి ముఖ్య అతిథులుగా విచ్చేసి.. కొత్తగా ఎంపికై న 20 మందితో పాటు గత మూడు ఎడిషన్లకు చెందిన 50 మందితో కలిపి మొత్తం 70 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కోసం సుమంగళ సంస్థ మొత్తం రూ.2.8 కోట్లను కేటాయించింది. సుమంగళ స్టీల్ వ్యవస్థాపకులు రాజేంద్రన్ సబనాయగమ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.
తిరువొత్తియూరు: రాణిపేట జిల్లా తెన్కడప్పంతంగల్ పాఠశాల వీధికి చెందిన సుధాకర్ కుమారుడు వసంత్ (21). ఇతను ఒరగడమ్ ప్రాంతంలో నివసిస్తూ, అక్కడి పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కర్మాగారంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకుని తన బైక్‌పై చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. దామల్ ఫ్లైఓవర్ సమీపంలోకి రాగానే, గుర్తుతెలియని ఒక వాహనం అతడి బైక్‌ను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వసంత్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ మార్గంలో వెళ్తున్న ఇతర వాహనదారులు వసంత్‌ను రక్షించి చికిత్స కోసం కాంచీపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అయితే, అక్కడ వసంత్ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. ఈ ప్రమాదంపై బాలుశెట్టి సత్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: తిరుపత్తూరులోని మరుదు సోదరుల విగ్రహాలకు మంత్రులు ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. శివగంగ జిల్లా, తిరుపత్తూరులోని మరుదు సోదరుల మణిమండపంలో స్మరణ దినోత్సవం జరిగింది ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు మరుదు సోదరుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిచారు. ఈ క్రమంలో మంత్రులు వచ్చే కంటే ముందే, శివగంగ ఎమ్మెల్యే రాణి మరుదు సోదరుల విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అయితే, ఒంటరిగా ఎందుకు వచ్చారు అని విలేకరులు ప్రశ్నించగా, ఎమ్మెల్యే రాణి సమాధానం ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కడే మంత్రుల రాకకోసం వేచి చూశారు. అనంతరం మంత్రులు నిర్మల్ కుమార్, డి.కె. ప్రభు, మహమ్మద్ పర్వేజ్, మదనరాజా విచ్చేసిన సమయంలో, అమె మళ్లీ మరుదు సోదరుల విగ్రహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించారు. కాగా, ఎమ్మెల్యే రాణి, మంత్రి డి.కె. ప్రభు కార్యక్రమాలను తరచూ బహిష్కరిస్తూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా సీఎం విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్లు వేరువేరుగా మరుదు సోదరుల వీరోచిత సేవలను పోరాటాలను గుర్తు చేస్తూ నివాళులర్పించారు.
తిరువొత్తియూరు: సేలం సూరమంగళం ప్రాంతీయ కార్యాలయంలో విజిలెన్స్ విభాగం నిర్వహించిన సోదాల్లో రూ. 30 లక్షల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమిళనాడు వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ యూనియన్ కార్యాలయాలతో సహా 43 చోట్ల అవినీతి నిరోధక శాఖ పోలీసులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 1.59 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. సేలంలో జరిగిన సోదాల సమయంలో కొందరు ప్రభుత్వ అధికారులు తమ వ్యక్తిగత అవసరాల కోసమే ఈ లావాదేవీలు జరిగాయని పేర్కొన్నారు.
సాక్షి చైన్నె: తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్య కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుగవనేశ్వర్ మృతి చెందారు. ఈ సమాచారంతో సీఎం ఎస్. జోసఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాన్ని విడుదల చేశారు. తమిళనాడు ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి తిరు. సుగవనేశ్వర్, ఐ.ఏ.ఎస్. (విశ్రాంత) కన్నుమూశారనే వార్త విని ఎంతో మనోవేదనకు గురయ్యానని పేర్కొన్నారు. సుగవనేశ్వర్ 1967వ సంవత్సరంలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా ఎంపికయ్యారన్నారు. తిరునెల్వేలిలో అసిస్టెంట్ కలెక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు.


