అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో.. భారత్‌ వాటా పెంచడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో.. భారత్‌ వాటా పెంచడమే లక్ష్యం

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

● ఇస్రో చైర్మన్‌ డా. వి. నారాయణన్‌ ● ఘనంగా శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ స్నాతకోత్సవం

సాక్షి,చైన్నె: శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ స్నాతకోత్సవం శనివారం జరిగింది. ఈ వేడుకకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ సెక్రటరీ, ఇస్రో చైర్మన్‌ డా. వి. నారాయణన్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నర్సింగ్‌, క్లినికల్‌ రీసెర్చ్‌, బయోమెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, ఆడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, బిహేవియరల్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ తదితర విభాగాలకు చెందిన 455 మంది విద్యార్థులకు ఆయన డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డా. వి. నారాయణన్‌ స్నాతకోత్సవ ప్రసంగం చేస్తూ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సాధించిన అద్భుతమైన మైలురాళ్లను, దేశ అంతరిక్ష కార్యక్రమానికి ఇస్రో అందిస్తున్న అమూల్యమైన సేవలను కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా దాదాపు 2%గా ఉందని, భవిష్యత్‌లో దీనిని 10%కి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. భారత అంతరిక్ష రంగం భవిష్యత్తు ప్రణాళికలుగా ప్రభుత్వం, ఇస్రో, ప్రైవేట్‌ పరిశ్రమల సంయుక్త కృషితో రాబోయే మూడేళ్లలో ఏటా 50 రాకెట్లను ప్రయోగించే స్థాయికి తయారీ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. భారత్‌ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్‌) ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పలు కీలకమైన సేఫ్టీ, క్రూ–ఎస్కేప్‌ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతరిక్ష సేవలకు, శాటిలైట్‌ ప్రయోగాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రయోగ వేదికలను విస్తరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీహరికోటలో రెండు లాంచ్‌ పాడ్లు ఉండగా.. తమిళనాడులోని కులశేఖరపట్నంలో కొత్తగా ప్రయోగ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విద్యా సంస్థ చాన్స్‌లర్‌ శ్‌ వి.ఆర్‌. వెంకటాచలం, ప్రొ–ఛాన్సలర్‌ శ ఆర్‌.వి. సెంగుటువన్‌, రిజిస్ట్రార్‌ డా.ఎస్‌. సెంథిల్‌ కుమార్‌, మెడికల్‌ కాలేజ్‌ డీన్‌ డా. కె. బాలాజీ సింగ్‌, పరీక్షల నియంత్రణాధికారి డా. ఆర్‌. పద్మావతి, రీసెర్చ్‌ డీన్‌ డా. పి. వెంకటాచలం, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ డైరెక్టర్‌ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement