సాక్షి, చైన్నె: ప్రముఖ పర్యాటక ప్రదేశం ఊటీ, కోతగిరి, కున్నూర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం కురిసింది. ఈ కారణంగా కూనూరు – మేటుపాలయం జాతీయ రహదారిపై పెనుప్రమాదం తప్పింది. బస్సుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఊటీ నుండి కోయంబత్తూరు వెళ్తున్న ఒక ప్రభుత్వ ఆర్టీసీ బస్సు కూనూరు సమీపంలోని పార్లియార్ ప్రాంతానికి చేరుకోగానే, ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడి భారీ బురద ప్రవాహం బస్సుపైకి దూసుకొచ్చింది. దీంతో ఆ బస్సు పూర్తిగా బురదలో కూరుకు పోయింది. సమాచారం అందుకున్న వెంటనే మెట్టుపాలయం అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బస్సులో చిక్కుకున్న ఆరుగురు ప్రయాణికులను అత్యంత సాహసోపేతంగా సురక్షితంగా బయటకు వెలికి తీశారు. అయితే, ఈ ప్రమాదంలో గాయపడిన బస్సు డ్రైవర్, కండక్టర్లను మెరుగైన వైద్యం కోసం మెట్టుపాలయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
రికార్డు స్థాయి వర్షపాతం–పాఠశాలలకు సెలవు
నీలగిరి జిల్లాలో గడచిన 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా పార్లియార్లో అత్యధికంగా 250 సెమి, వర్షపాతం కురిసింది. దిగువ కోతగిరిలో 20 సెమీ, ఎడప్పాడిలో 16, కోతగిరిలో 13 సెమీ, సాకేతై, దేవాల, కోడనాడు, కూనూరు రూరల్‌లో 8 సెమి చొప్పున వర్షం కురిసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఊటీ, కూనూరు, కోటగిరి, కుంత, గూడలూర్, పండలూర్ తాలూకాల పరిధిలోని అన్ని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీ భవ్య తెలిపారు. ఎలాంటి ప్రత్యేక తరగతులు కూడా నిర్వహించకూడదని స్పష్టం చేశారు. నీలగిరిలో వర్షాల తీవ్రత ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
కేరళ విద్యార్థులు సురక్షితం
కేరళ నుండి పర్యాటక యాత్ర నిమిత్తం ఊటీకి వచ్చిన పాఠశాల విద్యార్థుల బస్సులు, మెట్టుపాళయం – కూనూరు రహదారిలోని పర్లియార్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో మార్గంమధ్యలో చిక్కుకుపోయాయి. ముందు వెళ్తున్న ప్రభుత్వ బస్సుపై కొండచరియలు పడి పూర్తిగా దెబ్బతింది. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులనరినీ తాడుల సహాయంతో, కొండ మార్గాల గుండా సురక్షితంగా రక్షించి ప్రత్యేక వాహనాలు,రైళ్ల ద్వారా తరలించారు.
ప్రభుత్వ బస్సు డ్రైవర్ మృతి
కూనూరు నుండి కోయంబత్తూరు వెళ్తున్న ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్ కావడంతో ప్రయాణికులు దిగిపోయారు. టైరు మార్చిన అనంతరం డ్రైవర్ ఒక్కడే బస్సును తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో చెట్లు, కొండచరియలు విరిగిపడి బస్సు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, డ్రైవర్ జనకరాజ శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
కొడైకనాల్‌లో కుండపోత వర్షం
తమిళనాడులోని మరో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దిండిగల్ జిల్లా కోడైకనాల్ కొండల్లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర అలజడి సృష్టిస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, చెట్లు నేలకూలడం, రహదారులు కొట్టుకుపోవడంతో కొండ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కుండపోత వర్షానికి కోడైకనాల్ సమీపంలోని ఉడుక్కుం–పెరియకుళం పర్వత రహదారి దారుణంగా దెబ్బతింది. కొండచరియలు విరిగిపడటంతో పాటు భారీ బండరాళ్లు, వృక్షాలు రోడ్డుపై పడిపోయాయి. అంతేకాకుండా, వర్షపు నీటి ఉధృతికి రహదారి అనేక చోట్ల కొట్టుకుపోయి పెద్ద ఎత్తున పగుళ్లు, గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఉడుక్కుం–పెరియకుళం మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణంగా వట్టలకుండు, పళని మార్గాల ద్వారా ప్రజా రవాణా సాగుతున్నప్పటికీ, ప్రత్యామ్నాయ మార్గమైన ఈ రహదారి నిలిచిపోవడంతో కొండ ప్రాంతాల ప్రజలకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి. ఈ పర్వత రహదారిని స్థానిక కొండ గ్రామాల ప్రజలు తమ ద్విచక్ర వాహనాలు, నిత్యావసర వస్తువుల సరుకు రవాణా వాహనాల కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. మార్గం పూర్తిగా మూతపడటంతో ఉడుక్కుం ప్రాంతంలోని కొండ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధప్రాతిపదికన కొండచరియలు, కూలిన చెట్లను తొలగిస్తూ, దెబ్బతిన్న రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టే పనిలో అధికార వర్గాలు నిమగ్నమయ్యారు. వర్షాల తీవ్రత దష్ట్యా ప్రయాణికులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం
మెట్టుపాళయం – ఊటీ పర్వత రైల్వే మార్గంలో పలుచోట్ల కొండచరియలు , చెట్లు కూలిపోవడంతో రైలు సర్వీసులు తాత్కాలికంగా రద్దు చేశారు. కోయంబత్తూరు రహదారిలో భారీ గుంతలు పడి రోడ్డు లోయలోకి కూరుకుపోయింది. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో కోడనాడ్లోని కోటకి జలపాతాన్ని సందర్శించే పర్యాటకులపై ఒక రోజు నిషేధం విధించారు. జిల్లాలో ప్రజలు ,పర్యాటకులు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు
భారీ వర్షాల కారణంగా కూనూరు–మేటుపాలయం రోడ్డుతో పాటు కోతగిరి–మేటుపాలయం రోడ్డులోని పలు ప్రాంతాల్లోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అర్ధరాత్రి నుంచే ఈ మార్గాల్లో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అలాగే, మంజుర్–కోయంబత్తూరు రహదారిపై భారీ బండరాయి ఒకటి రోడ్డు మధ్యలోకి దొర్లుకుంటూ రావడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారి శాఖ సిబ్బంది వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో ఆ బండరాయిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. అయితే వర్షాల కారణంగా రోడ్డు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనలతో ప్రయాణిస్తున్నారు. ప్రమాదకరంగా ఉన్న రాళ్లను వెంటనే గుర్తించి తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
తుపాను హెచ్చరికలతో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరింత బలపడి తుపానుగా మరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ రానున్న రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం నీలగిరి, కోయంబత్తూరు, తేని, దిండిగల్, మదురై, తిరుచిరాపల్లి జిల్లాలతో పాటు చైన్నె, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కడలూరు, పుదుచ్చేరి ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. కాగా కన్యాకుమారి జిల్లాలో భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో లెమూర్ బీచ్, ముట్టం, కన్యాకుమారి బీచ్‌లతో పాటు అన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.


