పార్థసారథి ఆలయంలో ప్రసాదాల విక్రయం | - | Sakshi
Sakshi News home page

పార్థసారథి ఆలయంలో ప్రసాదాల విక్రయం

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

– ప్రారంభించిన మంత్రి రమేష్‌

సాక్షి,చైన్నె: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చైన్నె ట్రిప్లికేన్‌ పార్థసారథి స్వామి ఆలయంలో, భక్తులకు ఆలయ పరిపాలన యంత్రాంగమే స్వయంగా తయారుచేసిన నాణ్యమైన ప్రసాదాలను అందించే కొత్త పథకాన్ని హిందూ దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌ ప్రారంభించారు. అసెంబ్లీలో దేవాదాయ శాఖ నిధుల కేటాయింపుల సందర్భంగా ఆలయ ప్రాథమిక సౌకర్యాలు, అన్నదానం పథకం విస్తరణతో పాటూ భక్తులకు స్వచ్ఛమైన ప్రసాదాల పంపిణీపై పలు ప్రకటనలు వెలువడ్డాయి. అందులో భాగంగా ప్రైవేట్‌ వ్యక్తులు లేదా బయటి ప్రైవేట్‌ ఏజెన్సీలు తయారు చేసే నైవేద్యాలకు స్వస్తి చెప్పి, ప్రముఖ దేవాలయాల ప్రాంగణంలోనే ఆలయ పరిపాలన యంత్రాంగం ద్వారానే నాణ్యమైన నైవేద్యాలను తయారు చేసి భక్తులకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

37 అత్యంత ప్రధాన ఆలయాల్లో అమలు

ఈ నిర్ణయంలో భాగంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 37 అత్యంత ముఖ్యమైన దేవాలయాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. తంజావూరు జిల్లాలోని స్వామిమలై స్వామినాథన్‌ ఆలయం, కోయంబత్తూరు జిల్లా తెక్కంపట్టిలోని వనభద్రకాళియమ్మన్‌ ఆలయం, సహా పలు ప్రధాన క్షేత్రాలలో ఆలయ యాజమాన్యాలే నాణ్యమైన ప్రసాదాలను తయారు చేసి అందిస్తున్నాయి. ఈ వరుసలోనే తాజాగా పార్థసారథి ఆలయంలోనూ ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి రమేష్‌ స్వయంగా భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హిందూ మత, ధార్మిక ట్రస్టుల కమిషనర్‌ వినయ్‌, ఆలయ డిప్యూటీ కమిషనర్‌ సి. నిత్యతో పాటు ఇతర దేవాదాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

15 పతకాలతో సత్తా చాటిన తమిళనాడు అథ్లెట్లు

కొరుక్కుపేట: జపానన్‌లో జరిగిన పారా ఆసియా క్రీడల్లో తమిళనాడు నుంచి 13 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో తమిళనాడు నుంచి తొమ్మిది మంది క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో పాల్గొనగా, టేబుల్‌ టెన్నిస్‌, అథ్లెటిక్స్‌, పవర్‌లిఫ్టింగ్‌ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 9 మంది అథ్లెట్లు 15 పతకాలు గెలుచుకున్నారు. తమిళనాడు అథ్లెట్లు 3 స్వర్ణాలు, 5 రజతాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. అథ్లెటిక్స్‌లో ధర్మరాజ్‌ స్వర్ణం గెలుచుకున్నారు. లాంగ్‌ జంప్‌ 64 కేజీల విభాగంలో మొదటి స్థానం సాధించి అతను తమిళనాడుకు గర్వకారణంగా నిలిచారు. తులసి మాధి మురుగేశన్‌ బ్యాడ్మింటన్‌లో 3 పతకాలు గెలుచుకున్నారు. ఆమె మహిళల డబుల్స్‌లో స్వర్ణం, సింగిల్స్‌లో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం గెలుచుకుంది. నవీన్‌ – శివకుమార్‌ బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో స్వర్ణం గెలుచుకున్నారు. డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఆమె మొత్తం 2 పతకాలు సాధించారు. అదేవిధంగా, నిత్యాశ్రీ సుమతి శివన్‌ కూడా బ్యాడ్మింటన్‌లో 2 పతకాలు గెలుచుకున్నారు. ఆమె సింగిల్స్‌ విభాగంలో రజతం, మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్యం దక్కించుకున్నారు. ఇంకా పలువురు అథ్లెట్‌లు పతకాలతో తమిళనాడుకు 15 పతకాలు సాదించి పెట్టి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచారు.

భార్యను, కొడుకును

నరికి చంపి ఆత్మహత్య

అన్నానగర్‌: సిర్కాళి సమీపంలో కత్తితో భార్య, కుమారుడుని నరికి చంపి, భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. మైలాడుదురై జిల్లా సిర్కాళి సమీపంలో ఉన్న తిరుముల్లైవాసల్‌ గ్రామానికి చెందిన జలేంద్రన్‌ (50) జాలరి, మాజీ గ్రామ పెద్ద. ఇతని భార్య మలర్‌ సెల్వి (45). వీరి కుమారుడు అదిగుణన్‌ (25). కుటుంబ సమస్యల కారణంగా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవని తెలుస్తుంది. ఈ స్థితిలో, శనివారం ఉదయం చాలా ఆలస్యమైనప్పటికీ జలేంద్రన్‌ ఇల్లు తలుపు తెరవకపోవడంతో, చుట్టుపక్కల వారు ఆ ఇంటికి వెళ్లి తలుపు తట్టారు. అయిన కాని తలుపు తెరవకపోవడంతో వారికి అనుమానం కలిగింది.వారు కిటికీలోంచి చూడగా, ఇంట్లో మలర్‌ సెల్వి, అదిగుణన్‌ ఇద్దరూ కత్తిపోట్లతో రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైన స్థానికులు ఇంటి వెనుకకు వెళ్లగా, అక్కడ జలేంద్రన్‌ ఓ చెట్టుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులు సిర్కాళి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం సిర్కాళి ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అంతేకాకుండా, కేసు నమోదు చేసిన పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో, జలేంద్రన్‌ తన భార్యను, కొడుకును నరికి చంపిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది. అతను కుటుంబ సమస్యల వల్ల హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనా కారణం ఉందా? ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం, దిగ్భ్రాంతిని కలిగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement