చైన్నెలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

– త్వరలో 3 కొత్త ప్రాజెక్టులు

సాక్షి,చైన్నె: తమిళనాడు రాజధాని చైన్నె నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు రహదారుల శాఖ నడుం బిగించింది. నగరంలోని ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు 3 ప్రధాన కొత్త ప్రాజెక్టులను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదిక తయారీ కోసం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ మేరకు బేసిన్‌ బ్రిడ్జ్‌ విస్తరణను రూ. 19.10 లక్షలతో నిర్ణయించారు. గ్రాండ్‌ నార్తర్న్‌ ట్రంక్‌ రోడ్డులోని బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్ద ప్రస్తుతం తీవ్ర ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. బకింగ్‌హామ్‌ కెనాల్‌, బేసిన్‌ బ్రిడ్జి రైల్వే స్టేషన్‌ , ఒట్టేరి కెనాల్‌లను దాటే ఈ వంతెన రోడ్డు వెడల్పు ప్రస్తుతం కేవలం 6 మీటర్లు మాత్రమే ఉంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలలు, రైల్వే టెర్మినళ్లు , వాణిజ్య ప్రాంతాలకు ఇది కీలక మార్గం కావడంతో, ఈ వంతెనను వెడల్పు చేయడం అత్యవసరంగా మారింది.

వ్యాసర్పడి ఫ్లైఓవర్‌ విస్తరణ

వ్యాసర్పడి ప్రాంతంలోని గ్రాండ్‌ నార్తర్న్‌ ట్రంక్‌ రోడ్డుపై ఉన్న గ్రేడ్‌ సెపరేటర్‌ (ఫ్లైఓవర్‌) ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ట్రాఫిక్‌ ప్రవాహానికి అనుగుణంగా దీని విస్తరణ సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందిస్తున్నారు. కోయంబేడు – తిరుమంగళం కూవం వంతెన విస్తరణ కోసం రూ. 14.40 లక్షలను నివేదిక రూపకల్పన కోసం కేటాయించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ రోడ్డుపై, కోయంబేడు, తిరుమంగళం మధ్య ఉన్న కూవం నది వంతెనను విస్తరించేందుకు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం 18.8 మీటర్లు ఉన్న ఈ వంతెన వెడల్పును 33.8 మీటర్లకు పెంచాలని ప్రతిపాదించారు. వంతెనను ఇరువైపులా 7.5 మీటర్ల చొప్పున విస్తరిస్తారు. 131 మీటర్ల పొడవున్న ఈ వంతెనలోని 8 భాగాలలో విస్తరణ పనులు చేపట్టేలా ప్లాన్‌ చేస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్టులకు సంబంధించి సాంకేతిక సాధ్యాసాధ్యాలు, పర్యావరణ ప్రభావం, భూసేకరణ, అంచనా వ్యయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కాంట్రాక్టర్లు వివరణాత్మక ప్రాజెక్ట్‌ నివేదికను సమర్పిస్తారు. ఆ తర్వాత నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement