వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి

Oct 24 2026 4:59 AM | Updated on Oct 24 2026 4:59 AM

వృద్ధుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి

సాక్షి, చైన్నె: ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌, రీసెర్చ్‌ సెంటర్‌ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నివారణ నుంచి విధానం వరకు– ఆరోగ్యకరమైన వృద్ధాప్య వ్యవస్థలను నిర్మించడం అనే ఇతివత్తంతో ‘ఏజ్‌ వెల్‌ ఇండియా జాతీయ జెరియాట్రిక్‌ సదస్సు ప్రారంభమైంది. వృద్ధుల ఆరోగ్య సంరక్షణ అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మద్దతుగా బలమైన వ్యవస్థలను నిర్మించడమే సదస్సు లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బినోద్‌ కుమార్‌ పాత్రో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్‌ వి.ఎస్‌.నటరాజన్‌ జెరియాట్రిక్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌ పద్మశ్రీ డాక్టర్‌ వి.ఎస్‌.నటరాజన్‌ గౌరవ అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజ్‌ డీన్‌ (మెడికల్‌) ప్రొఫెసర్‌ ఆర్‌.జయంతి మాట్లాడుతూ వృద్ధుల సంరక్షణ ఉచిత లేదా నాణ్యమైన వైద్యం అందించడం మాత్రమే కాదన్నారు. వారి వయసుకు తగిన గౌరవాన్ని ఇవ్వడమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల జనాభా పెరుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, హుందాగా, గౌరవప్రదంగా వృద్ధాప్యాన్ని గడిపేలా చూడడం అందరి సామాజిక బాధ్యతని స్పష్టం చేశారు. డాక్టర్‌ బినోద్‌ కుమార్‌ పాత్రో మాట్లాడుతూ వృద్ధుల ఆరోగ్య సంరక్షణను ప్రాథమిక ఆరోగ్య వైద్య విధానంలో భాగం చేయాలన్నారు. నివారణ, పునరావాసం, గౌరవప్రదమైన సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పద్మశ్రీ డాక్టర్‌ వి.ఎస్‌.నటరాజన్‌ మాట్లాడుతూ సమాజంలో యువత నిష్పత్తి తగ్గి వృద్ధుల జనాభా పెరుగుతోందన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్య సవాళ్లను తీవ్రంగా పరిగణించాలని, వైద్యపరమైన బాధ్యత కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని గుర్తు చేశారు. వృద్ధులు స్వతంత్రంగా, నాణ్యమైన జీవితం గడిపేలా చేయడానికి సంరక్షణ సేవలు, పునరావాస కేంద్రాలు విస్తరించాలని తెలిపారు. అలాగే నిపుణులైన జెరియాట్రిషియన్ల (వృద్ధాప్య వైద్య నిపుణులు) సంఖ్యను పెంచేందుకు తగిన శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

భవిష్యత్‌ దిశగా ఒక అడుగు

వృద్ధుల ఆరోగ్య సంరక్షణను విస్తృత ప్రజారోగ్య ఎజెండాలో భాగం చేయడానికి ఎస్‌ఆర్‌ఎం మెడికల్‌ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగం ఈ వేదిక ద్వారా శ్రీకారం చుట్టింది. నివారణ ఆధారిత ఆరోగ్య సంరక్షణను, ప్రభుత్వ విధానాలు సంస్థాగత ప్రణాళికలతో అనుసంధానించాల్సిన అవసరాన్ని ఈ సదస్సు నొక్కిచెప్పింది. జనాభా మార్పులకు అనుగుణంగా వైద్యాన్ని సులభతరం చేయడంలో వైద్య సంస్థల పాత్ర ఎంత కీలకమో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement